బ్యాంకు vs పోస్టాఫీస్.. మీ డబ్బు ఎక్కడ ఎక్కువ భద్రంగా ఉంటుంది?
బ్యాంకులు లేదా పోస్టాఫీస్‌లో మీ డబ్బు భద్రతపై ఆందోళన చెందుతున్నారా? బ్యాంక్ దివాలా తీస్తే, DICGC ద్వారా గరిష్టంగా రూ. 5 లక్షల వరకు మాత్రమే హామీ ఉంటుంది. పెద్ద మొత్తాలను ఒకే బ్యాంకులో ఉంచడం ప్రమాదం. పోస్టాఫీస్ పొదుపు పథకాలకు కేంద్ర ప్రభుత్వ సార్వభౌమ హామీ ఉండటం వల్ల మీ మొత్తం డబ్బుకు 100 శాతం భద్రత ఉంటుంది.

ప్రస్తుతం చాలామంది తమ పొదుపులను బ్యాంకులు లేదా పోస్టాఫీస్‌లో భద్రపరుస్తున్నారు. అయితే ఒకవేళ ఆర్థిక సంస్థ కుప్పకూలితే మన డబ్బు ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది అనే ప్రశ్న కీలకం. మన దేశంలో బ్యాంకుల విషయంలో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా డిపాజిటర్లకు భద్రత కల్పించబడుతుంది. ఇది RBI అనుబంధ సంస్థ. ఈ నిబంధనల ప్రకారం ఒక బ్యాంకు దివాలా తీసినా, ప్రతి ఖాతాదారుడికి అసలు + వడ్డీ కలిపి గరిష్టంగా రూ.5 లక్షల వరకు మాత్రమే హామీ ఉంటుంది.
అంటే ఒకే బ్యాంకులో రూ.5 లక్షలకంటే ఎక్కువ డిపాజిట్ ఉంటే, మిగిలిన మొత్తానికి భద్రత ఉండదు. అందుకే పెద్ద మొత్తాలను ఒకే బ్యాంకులో ఉంచకుండా విభజించి పెట్టాలని నిపుణులు సూచిస్తారు. ఇక పోస్టాఫీస్ విషయానికి వస్తే, పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పోస్టాఫీస్ పొదుపు పథకాలు నేరుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. దీనివల్ల డిపాజిట్లకు సార్వభౌమ హామీ లభిస్తుంది. అంటే పోస్టాఫీస్‌లో మీరు పెట్టిన మొత్తం డబ్బుకు 100 శాతం భద్రత ఉంటుంది. బ్యాంకుల్లా రూ.5 లక్షల పరిమితి ఇక్కడ లేదు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), టైమ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి పథకాలు పూర్తిగా ప్రభుత్వ మద్దతుతో నడుస్తాయి. అందువల్ల ఇవి అత్యంత సురక్షిత పెట్టుబడులుగా పరిగణించబడుతున్నాయి. డిఫాల్ట్ అయ్యే ప్రమాదం దాదాపు లేనట్టే. అయితే పోస్టాఫీస్ పథకాలలో పెట్టుబడికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు, PPFలో సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. SCSSలో గరిష్ట పరిమితి రూ.30 లక్షలు. నెలవారీ ఆదాయ పథకంలో వ్యక్తిగతంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాల్లో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
