Man dumps Rs 1.3 crore BMW X6 car in Cauvery river: కోట్ల విలువచేసే బీఎండబ్ల్యూ కారును ఓ వ్యక్తి నదిలో వదిలేశాడు. కర్ణాటకలో వెలుగు చేసిన ఈ వింత కేసు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని శ్రీరంగపట్నం వాసులు కావేరీ నదిలో సగం మేరకు నీటమునిగిన ఎరుపు రంగు బీఎండబ్ల్యూ కారును చూసి ప్రమాదవశాత్తు పడిపోయిందేమోనని మొదట కంగారుపడి పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా కారులో ఎవరైనా చిక్కున్నారేమోనని నదిలో దూకి పరిశీలించగా.. కారులో ఎవరులేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆనక విషయం తెలిశాక.. ఔరా! అని ముక్కునవేలేసుకున్నారు.
ఆ తర్వాత..సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నీటిలో మునిగిన కారును బయటికి తీసి చూడగా.. అది బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 (BMW X6 SUV) అని, మార్కెట్లో దాని విలువ సుమారు1.3 కోట్లు ఉంటుందని తేల్చారు. ఐతే కారును ఎవరైనా దొంగిలించి నదిలో వదిలేశారా? లేక మరైదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరపగా షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. నిజానికి ఈ కారు.. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి చెందిందని కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా రవాణా శాఖ అధికారులు సమాచారం అందించారు. కారు యజమానిని పిలిచి అధికారులు ప్రశ్నించగా పోలీసులకు సరైన సమాధానం దొరకలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులను విచారించారు.
సదరు వ్యక్తి తల్లి తాజాగా మరణించిందని, అప్పటి నుంచి అతను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని, ఇంటికి తిరిగి వస్లూ తన BMW SUV కారుని నదిలో పడేశాడని తెలిపారు. ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదులు అందకపోవడంతో కారు యజమానిని విడుదల చేసి, కారును అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎస్‌యూవీ కారు జర్మనీ లగ్జరీ కార్ బ్రాండ్‌కు చెందినది. మన దేశ మార్కెట్లలో దొరికే అత్యంత ఖరీదైన కార్లలో ఇదీ ఒకటి. దీని ప్రారంభ ధర రూ.50 లక్షల నుంచి మొదలవుతుంది. ఏది ఏమైనప్పటికీ కోట్ల విలువచేసే ఖరీదైన లగ్జరీ కారును వృథాగా నదిలో పారవేసిన సదరు వ్యక్తి చర్య అందరినీ ఆశ్యర్యపరుస్తోంది