Indian Railway: ఇకనుంచి మీరు డీజిల్ ఇంజిన్ రైళ్లలో సుదూర ప్రాంతాలకి ప్రయాణిస్తే అధికంగా చెల్లించాల్సిందే. ఎందుకంటే ఇండియన్ రైల్వే డీజిల్ రైళ్ల టికెట్ చార్జీలని పెంచే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే లైన్లలో విద్యదీకరణ పూర్తిగా జరగలేదు. ఇప్పటికీ డీజిల్ ఇంజిన్ రైళ్లు చాలా మార్గాల్లో నడుస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల టికెట్ ధరలు పెంచాల్సివస్తోందిని రైల్వే చెబుతోంది. ఏప్రిల్ 15 నుంచి డీజిల్ రైళ్ల టిక్కెట్లపై అదనపు ఛార్జీలు విధించే అవకాశాలున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కచ్చితంగా టిక్కెట్ల ధరలను పెంచే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.
డీజిల్ ఇంజిన్‌తో నడిచే రైళ్ల టిక్కెట్లపై హైడ్రోకార్బన్ ఛార్జీ లేదా డీజిల్ పన్నుని పరిశీలిస్తున్నారు. రూ.10 నుంచి రూ.50 వరకు పన్ను విధించాలని రైల్వే బోర్డు యోచిస్తోంది. డీజిల్ ఇంజిన్ రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లపై ఈ ప్రభావం పడనుంది. పూర్తిగా విద్యుదీకరించని మార్గాల్లో ఇప్పటికీ డీజిల్ ఇంజన్లతో రైళ్లను నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో డీజిల్‌పై పన్ను లేదా హైడ్రోకార్బన్ సర్‌చార్జి విధించే ఆలోచనలో రైల్వే బోర్డు ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో పెరుగుతున్న చమురు ధరలు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో చమురు అవసరాలు చాలా వరకు దిగుమతులపై ఆధారపడే ఉంటాయి. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి రైల్వే శాఖ సర్‌చార్జి విధించడం లేదా టికెట్ ధరను పెంచడంపై ఆలోచిస్తోంది.
ఏసీ క్లాస్ టిక్కెట్లపై కొత్త సర్‌చార్జి రూ.50 కాగా, స్లీపర్ క్లాస్ టిక్కెట్‌ల ధర రూ.25 ఉంటుందని తెలుస్తోంది. అలాగే సాధారణ తరగతి టిక్కెట్లపై రూ.10 పెంపు ఉంటుంది. సబర్బన్ రైలు ప్రయాణ టిక్కెట్లపై అటువంటి ఛార్జీలు ఉండవు. ఇప్పటికే డీజిల్ లోకోమోటివ్‌లతో నడిచే రైళ్లను గుర్తించాలని రైల్వే అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 15 లోపు బుక్ చేసుకున్న రైలు టిక్కెట్లపై సర్‌చార్జి విధిస్తుందా లేదా అనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం, సౌదీ అరేబియా, యెమెన్ మధ్య ఉద్రిక్తతల మధ్య ప్రపంచ చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రష్యా నుంచి సబ్సిడీ ధరలకు భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.