Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto retail sales: టాప్ గేర్ లో దూసుకుపోతున్న ఆటో రిటైల్ మార్కెట్.. జనవరిలో పెరిగిన అమ్మకాలు

దేశంలోని ఆటో మొబైల్ పరిశ్రమకు నూతన ఏడాది బాగా కలిసి వచ్చేలా ఉంది. తొలి నెల జనవరిలోనే ఆటో మొబైల్ రిటైల్ అమ్మకాలు జోరందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన ఏడు శాతం పెరిగి 22,91,621 యూనిట్లకు చేరుకున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) ఈ విషయాన్ని వెల్లడించింది. వివిధ విభాగాలలో డిమాండ్ విపరీతంగా పెరిగిందని తెలిపింది. గతేడాది ఇదే నెలలో 21,49,117 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

Auto retail sales: టాప్ గేర్ లో దూసుకుపోతున్న ఆటో రిటైల్ మార్కెట్.. జనవరిలో పెరిగిన అమ్మకాలు
Auto Retail Sale
Follow us
Srinu

|

Updated on: Feb 07, 2025 | 4:10 PM

దేశమంతటా 26,500 డీలర్ షిప్ లతో ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) ఏర్పడింది. దీని అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరిలో అన్ని రకాల విభాగాలలో పెరుగుదల నెలకొంది. టూ వీలర్స్, త్రీ వీలర్, టాక్టర్, కమర్షియల్ వెహికల్స్ (సీవీ).. ఇలా ప్రతి వాహన వర్గం సానుకూల ధోరణి కనబరిచింది. వినియోగదారుల విశ్వాసం, స్థిరమైన మార్కెట్ పునరుద్ధరణకు ఇది నిదర్శనంగా నిలిచింది. గత నెలలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 16 శాతం పెరిగి 4,65,920 యూనిట్లకు చేరుకున్నాయి. వీటి డిమాండ్ బాగా పెరిగిందని చాలా మంది డీలర్లు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాల రిటైల్ అమ్మకాలు గత నెలలో 15.2 లక్షల యూనిట్ల వద్ద కొనసాగాయి. గత సంవత్సరం ఇదే నెలలో 14.6 లక్షల యూనిట్లతో పోల్చితే నాలుగు శాతం పెరుగుదల నమోదైంది. గ్రామీల ప్రాంతాల కన్నా పట్టణాల్లో వాహనాల కొనుగోళ్లలో స్వల్ప పెరుగుదల కనిపించింది. గతేడాదితో పోల్చితే నాలుగు నుంచి ఐదు శాతం ఎక్కువగా నమోదైంది.

వాహనాల అమ్మకాలు పెరుగుదల వెనుక ఉన్న కారణాలను కూడా ఎఫ్ఏడీఏ ప్రతినిధులు వెల్లడించారు. కొత్త మోడల్ వాహనాల విడుదల, వివాహాల సీజన్, మెరుగైన ఫైనాన్సింగ్ వంటివి దీనికి కారణమని తెలిపారు. అయితే పెరుగుతున్న వడ్డీరేట్లు, గ్రామీణ ద్రవ్యత సవాళ్లు, మార్కెట్ అనిశ్చిత గురించి ఆందోళనలు ఇప్పటికీ ఉన్నాయన్నారు. కానీ మార్కెట్ పెరుగుతూ ఉండడంపై సంతోషం వ్యక్తం చేశారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు గతేడాదితో పోల్చితే 8 శాతం పెరిగి 99,425 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రాక్టర్ విక్రయాలు 5 శాతం పెరిగి 93,381కి చేరాయి. ఇక త్రీ వీలర్ రిటైల్ అమ్మకాలు ఏడు శాతం పెరిగి 1,07,033గా నమోదయ్యాయి. ఏది ఏమైనా నూతన సంవత్సరంలో ఆటోమొబైల్ మార్కెట్ కు మంచి శుభారంభం లభించింది.

తాజా సర్వే ప్రకారం.. దాదాపు సగం మంది డీలర్లు (46 శాతం) ఈ ఫిబ్రవరిలో కూడా అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరో 43 శాతం మంది మాత్రం స్థిరంగా కొనసాగుతాయని అభిప్రాయపడుతున్నారు. మిగిలిన 11 శాతం మంది ఈ నెలలో విక్రయాలు తగ్గుతాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి