జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన రాబడి కోసం కొన్ని పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. అయితే వేతన జీవులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో నెలవారీ పొదుపు పథకాల్లో పెట్టుబడికి ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని ఆకట్టుకోవడానికి అన్ని బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల వంటి సంస్థలు రికరింగ్ డిపాజిట్లల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి. పెట్టుబడికి భరోసాతో పాటు నమ్మకమైన రాబడితో ఈ పథకాలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే సాధారణంగా ఆర్‌డీలను చాలా మంది పోస్టాఫీసుల్లోనే కట్టడానికి మక్కువ చూపుతారు. ప్రతి గ్రామంలో కచ్చితంగా పోస్టాఫీసు ఉంటుంది కాబట్టి ప్రీమియం చెల్లించడానికి సౌకర్యంగా ఉంటుందని అందరూ పోస్టాఫీసుల్లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. అయితే బ్యాంకింగ్ రంగంలో కూడా టెక్నాలజీ పెరగడంతో పాటు ఖాతాదారులను ఆకట్టుకోవడానికి ఎస్‌బీఐ వంటి బ్యాంకులు అత్యధిక శాఖలతో ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి పోస్టాఫీసు అనువైనదా? ఎస్‌బీఐ అనువైనదా? అనే అంశం అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ రెండింటిల్లో ఏయే పథకంలో ఎంత మేర వడ్డీ వస్తుంది? అనే అంశాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఎస్‌బీఐ ఒక సంవత్సరం నుంచి పదేళ్ల కాలవ్యవధి వరకు రికరింగ్ డిపాజిట్లను అనుమతిస్తుంది. ఆ తర్వాత ప్రతి నెలా రూ.100 కనిష్ట డిపాజిట్ అవసరం దాన్ని రూ.10 గుణిజాల్లో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్‌బీఐ సాధారణ ప్రజలకు 6.5 శాతం నుంచి 7 శాతం పరిధిలో రికరింగ్ డిపాజిట్లపై వడ్డీని అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7 శాతం నుంచి 7.5 శాతం వరకూ వడ్డీని అందిస్తుంది. ఈ తాజా రేట్లు 15 ఫిబ్రవరి 2023 నుంచి అమల్లోకి వస్తాయి.
రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) వర్తిస్తుంది. సంపాదించిన ఆర్‌డీ వడ్డీ రేట్లపై 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే టీడీఎస్ తీసేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి