దేశంలో విద్యుత్ శ్రేణి వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా కంపెనీలు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. సరికొత్త డిజైన్, అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారైన ఏథర్ ఎనర్జీ ఓ కొత్త వేరియంట్ దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఏథర్ ఎనర్జీ కంపెనీ తన ప్రస్థానం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతోంది. ఈ మైల్ స్టోన్ సందర్భంగా 2024 450 అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మన దేశంలో లాంచ్ చేసింది. ఈ ఏథర్ 450 అపెక్స్ స్కూటర్ 450ఎక్స్ వేరియంట్ ఆధారంగానే రూపొందించింది. అయితే దాని లుక్, డిజైన్, స్టైలింగ్, ఫీచర్లలో కొన్ని అప్ గ్రేడ్ లను తీసుకొచ్చింది. ఇది 1.89లక్షలు(ఎక్స్ షోరూం)నకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ కు ఫేమ్ 2 సబ్సిడీ రాదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 7 కేడబ్ల్యూ(9.3 బీహెచ్పీ)ని ఉత్పత్తి చేస్తుంది. 450ఎక్స్ వేరియంట్లో ఇది 6.4(8.5బీహెచ్పీ)గా ఉండేది. గరిష్ట టార్క్ అయితే రెండింటిలోనూ 26ఎన్ఎంగా ఉంది. దీనిలో అదనపు శక్తిని వార్ పీప్లస్(Warp+) మోడ్ ద్వారా పొందుతుంది. 450 ఎక్స్ వేరియంట్లో వార్ పీ మోడ్ మాత్రమే ఉండేది.
ఈ స్కూటర్ గరిష్టంగా 100కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. కేవలం 2.9 సెకండ్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. 450ఎక్స్ వేరియంట్ తో పోల్చితే ప్రారంభ యాక్సెలరేషన్ 13శాతం అదనంగా ఇచ్చారు. అలాగే 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంలో 30శాతం పెరిగింది.
దీనిలో ఏథర్ న్యూ మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా రీజెనరేటివ్ బ్రేకింగ్ కి సపోర్టు చేస్తుంది. ఈ బ్రేకింగ్ చాలా సమర్థంగా పనిచేస్తుంది. అంతేకాక దీని రేంజ్ కూడా సింగిల్ చార్జ్ పై 157 కిలోమీటర్ల ఉంటుంది. అదే సమయంలో 450ఎక్స్ లో మాత్రం రేంజ్ 150కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.
ఈ స్కూటర్ డైమెన్షన్స్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే ఈ స్కూటర్ ను ప్రత్యేకమైన కలర్ స్కీమ్లో ఆవిష్కించింది. సరికొత్త ఇండియమ్ బ్లూ కలర్ తో పాటు బ్రైట్ ఆరెంజ్ కాంబినేషన్లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాక దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే సైడ్ ప్యానల్స్ పూర్తి ట్రాన్స్ పరెంట్ ఇచ్చారు. దీంతో లోపలి ఛాసస్ అందంగా కనిపిస్తుంది. అలాగే టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డు, కొత్త గ్రాఫిక్స్ ను ఇందులో తీసుకొచ్చారు. ఇక మెకానికల్ అంశాలను పరిశీలిస్తే 45ఎక్స్ మాదిరిగానే ఉంచారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవగా.. 2024 మార్చి నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. ఏథర్ షోరూమ్స్ ఫిబ్రవరి నుంచి ఈ స్కూటర్లు ప్రదర్శనకు వస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..