Dhanteras: ధనత్రయోదశికి బంగారం కొంటున్నారా..?ఆ రోజు మంచి సమయాలు ఇవే..!
హిందూ సంప్రదాయాలలో పండుగలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి పండుగకు విశిష్టత ఉంటుంది. ప్రస్తుతం దీపావళి రాబోతోంది. వెలుగులు విరజిమ్మే ఈ పండగ అంటే పిల్లల నుంచి పెద్దలందరికీ ఎంతో ఇష్టం. అయితే దీపావళికి ముందు వచ్చే ధన్ త్రయోదశి (ధన్ తేరాస్)కి ఎంతో ప్రాధాన్యముంది.
ధనత్రయోదశి రోజున బంగారం, వెండి వస్తువులు కొనడం భారతీయుల సంప్రదాయం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, ఐశ్వర్యం పెరుగుతుందని భావిస్తారు. ఆయుర్వేద దేవుడు ధన్వంతరి, లక్ష్మీదేవి, కుభేరులను ఈ రోజునే పూజిస్తారు. ఈ ఏడాది ధనత్రయోదశి ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఏ సమయంలో వస్తువులు కొనుగోలు చేస్తే మంచిదో తెలుసుకుందాం. దీపావళి ఉత్సవాలు ధనత్రయోదశి నుంచి ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. ముఖ్యంగా ధనత్రయోదశి రోజు బంగారం, వెండి వస్తువులను, భూమి తదితర స్థిరాస్తులను కొనుగోలు చేయడం మంచిదని నమ్మకం. ౌ
ఈ ఏడాది అక్టోబర్ 29వ తేదీ ఉదయం 10.31 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 వరకూ కొనసాగుతుంది. కాబట్టి 29 తేదీనే ధనత్రయోదశిని జరుపుకొంటారు. ప్రదోష కాలంలో ధన్వంతరిని పూజించడంతో పాటు దీపాలను వెలిగిస్తారు. తమ శక్తి మేరకు దానధర్మాలు చేస్తారు. ధనత్రయోదశికి పూజలు చేయడంతో పాటు బంగారం, వెండి కొనుగోలుకు పంచాంగం ప్రకారం ముహూర్తాలున్నాయి. దీనికి 29వ తేదీ రాత్రి 6.57 నుంచి 8.21 వరకూ మంచి సమయం అని చెబుతున్నాయి. అలాగే దేశంలోని ప్రముఖ నగరాల్లో కొనుగోళ్లకు మంచి సమయాలు ఇలా ఉన్నాయి. నోయిడాలో సాయంత్రం 6.31 నుంచి రాత్రి 8.12 వరకూ, అహ్మదాబాద్ లో 6.59 నుంచి 8.35 వరకూ, బెంగళూరులో 6.55 నుంచి 8.22 వరకూ, ముంబైలో 7.04 నుంచి 8.37 వరకూ, కోల్ కతాలో 5.57 నుంచి 7.33 వరకూ, చండీగఢ్ లో 6.29 నుంచి 8.13 వరకూ, గుర్గావ్ లో 6.32 నుంచి 8.14 వరకూ, హైదరాబాద్ లో 6.45 నుంచి 8.15 వరకూ, జైపూర్ లో 6.40 నుంచి 8.20 వర కూ, చెన్నైలో 6.44 నుంచి 8.11 వరకూ, న్యూఢిల్లీలో 6.31 నుంచి 8.13 వరకూ, పూణేలో 7.01 నుంచి 8.33 వరకూ కొనుగోలు చేసుకోవచ్చని పంచాంగ పండితులు చెబుతున్నారు.
సాధారణంగా బంగారం, వెండి వస్తువుల కొనుగోలుకే ప్రజలు ప్రాధాన్య మిస్తున్నా మరికొన్నింటిని కూడా కొనుగోలు చేయడం వల్ల శుభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. మట్టి లేదా లోపంతో చేసిన లక్ష్మీదేవి, వినాయకుని విగ్రహాలు, కారు, ఫోన్, ల్యాప్ టాప్, మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్, భూములు, స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ధన అంటే సంపద, తేరాస్ అంటే పదమూడురెట్లు అని అర్థం. అంటే ఈ రోజున కొన్న సంపద పదమూడురెట్టు పెరుగుతుందని నానుడి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..