Aadhaar Card: ఆధార్.. ఈ కార్డు లేనిదే ప్రస్తుతం ఏ పని జరుగని పరిస్థితి నెలకొంది. ఇది తప్పనసరి కానప్పటికీ.. అన్నింటికీ అవసరం పడుతుంది. ఆధార్ వివరాలు నమోదు చేయకపోతే ప్రభుత్వ పథకాలు మొదలు.. అనేక అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న పని మొదలు పెద్ద పని వరకు అన్నింటికీ ఆధార్ అవసరం పడుతోంది. మొబైల్ సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా.. లోన్స్ తీసుకోవాలన్నా, పీఎఫ్ తీసుకోవాలన్నా.. ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో చేరాలన్నా.. ఆధార్ వివరాలు తప్పనిసరి. ఆధార్ అనేది మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా రుజువు మాత్రమే కాదు.. పూర్తి బయోమెట్రిక్ వివరాలు కలిగి ఉన్న అధికారిక డాక్యూమెంట్. అయితే ఆధార్‌లో చేసిన తప్పులు సరిచేయాలంటే కొన్ని నియమాలు కఠినంగా ఉంటాయి.
ఉదాహరణకు.. పుట్టిన తేదీ, జెండర్ విషయంలో తప్పు ఉంటే దాన్ని సరిదిద్దడానికి ఒకే ఒక్క అవకాశం ఉంటుంది. దీని ప్రక్రియ కూడా కష్టం. అందువల్ల పుట్టిన తేదీ, జెండర్ వివరాలు నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆధార్ కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. దరఖాస్తుదారు ఏదైనా ఆధార్ కేంద్రానికి వెళ్లి అక్కడ జెండర్ మార్పు కోసం అభ్యర్థించవచ్చు. కానీ అక్కడ అభ్యర్థన తిరస్కరిస్తే దరఖాస్తుదారు 1947 కి కాల్ చేయాలి. అవసరమనుకుంటే వినియోగదారుడు help@uidai.gov.in కు ఒక లేఖ కూడా రాయవచ్చు. దీని ఆధారంగా ఆధార్ లేదా UIDAI ఒక నిర్ణయం తీసుకుంటుంది.
ఆధార్‌లో తండ్రి లేదా భర్త పేరు రాయడానికి పెద్ద మార్పు జరిగింది. గతంలో S/O లేదా W/O అనే కాలమ్స్ ఉండేవి. కానీ వీటికి బదులు ఇప్పుడు C/O కేర్ ఆఫ్ అనే కాలమ్ వచ్చింది. ఇప్పుడు తండ్రి లేదా భర్త పేరు C/O కాలమ్‌లో అప్‌డేట్ చేయవచ్చు. అయితే ఈ పని ఆన్‌లైన్‌లో కుదరదు. దీని కోసం మీరు ఏదైనా సమీప ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ మీ చిరునామా అప్‌డేట్ కోసం అభ్యర్థించాలి. అప్పుడు ఫారమ్ నింపేటప్పుడు తండ్రి లేదా భర్త పేరును నమోదు చేయాలి. ఫారమ్‌లో మిగిలిన చిరునామా కాలమ్‌లు మునుపటిలాగే ఉన్నాయి. ఆధార్‌కి లింక్ చేయబడిన మొబైల్ నంబర్ ఉండాలి దానికి OTP వస్తాయి. ఆధార్‌కు సంబంధించిన సందేశాలు కూడా అదే మొబైల్ నంబర్‌కి వస్తాయి.