8th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్! జీతాలు, పెన్షన్లపై కీలక సమావేశం
కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం అమలుకు సన్నాహాలు వేగవంతం చేసింది. మే 13, 14న రక్షణ, రైల్వే శాఖల ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో న్యూఢిల్లీలో కీలక సమావేశాలు జరుగనున్నాయి. జీతాలు, పెన్షన్లు, భత్యాలపై చర్చించి, ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు వినడం, భవిష్యత్ వేతన నిర్మాణానికి అభిప్రాయాలు సేకరించడం ప్రధాన లక్ష్యం.

8వ వేతన సంఘం అమలుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను వేగవంతం చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధులతో మే 13, 14 తేదీలలో న్యూఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, భత్యాలు, సేవా నిబంధనలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశాల్లో సవివరంగా చర్చించనున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 8వ వేతన సంఘం కోసం జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియలో భాగంగానే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. భవిష్యత్ వేతన నిర్మాణం, అలవెన్సులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష అభిప్రాయాలను సేకరించడం ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలకు తమ సమస్యలు, డిమాండ్లు నేరుగా తెలియజేసే అవకాశం ఈ సమావేశాల ద్వారా లభించనుంది.
ఈ సమావేశాలకు హాజరుకావాలనుకునే సంఘాలు, ప్రతినిధులు అధికారిక ఎన్‌ఐసి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. నిర్దేశిత నమూనాలో వినతిపత్రం సమర్పించిన తర్వాత వారికి మెమో ఐడి జారీ చేస్తారు. ఎంపికైన ప్రతినిధులకే సమావేశాలకు అనుమతి ఉంటుంది. జీతాల పెంపు, డీఏ విలీనం, కొత్త అలవెన్సులు, పెన్షన్ సవరణలు, సేవా నిబంధనల్లో మార్పులు వంటి అంశాలు ప్రధాన చర్చాంశాలుగా ఉండే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాల్లో గణనీయమైన పెంపు అవసరమని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇక భవిష్యత్తులో ఇతర శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాలతో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగుల సమస్యలను నేరుగా వినడం, విధానాలను మరింత పారదర్శకంగా రూపొందించడం ఈ సంప్రదింపుల లక్ష్యమని అధికారులు పేర్కొంటున్నారు. 8వ వేతన సంఘంపై తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో, ఈ సమావేశాలపై విస్తృత ఆసక్తి నెలకొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
