Video: వేటాడి వేటాడి చంపేస్తాం.. ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్.. ఈ వీడియో చూశారా..
అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు భారత్ ఇచ్చిన గట్టి సమాధానం ఆపరేషన్ సింధూర్. సరిగ్గా ఏడాది క్రితం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ సరిహద్దు అవతల సైన్యం జరిపిన మెరుపు దాడులు భారత సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సందర్భంగా సైన్యం ప్రత్యేక వీడియోలను విడదుల చేసింది.

భారత సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఆపరేషన్ సింధూర్‌కు నేటితో ఏడాది పూర్తయింది. సరిహద్దు అవతల ఉగ్రవాదమే ఊపిరిగా బతుకుతున్న శక్తులపై భారత్ జరిపిన ఈ మెరుపు దాడి ప్రపంచ దేశాలకు మన దేశ సత్తాను చాటి చెప్పింది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారత సైన్యం, వైమానిక దళం విడుదల చేసిన సరికొత్త వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ రక్తపు గాయానికి సింధూర్ ప్రతీకారం
ఈ ఆపరేషన్ వెనుక ఉన్న నేపథ్యం అత్యంత విషాదకరమైనది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసారన్ లోయలో ఉగ్రవాదులు చేసిన కిరాతకం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పర్యాటక ప్రాంతమైన ఆ లోయలో అమాయక ప్రజలను వారి మతం అడిగి మరీ 26 మందిని కాల్చి చంపారు. పసిపిల్లలు, మహిళల కళ్లెదుటే వారి కుటుంబ సభ్యులను కాల్చివేసిన ఆ ఉగ్రవాదుల అరాచకానికి సమాధానంగా.. భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్‌కు నాంది పలికింది. సరిగ్గా గత ఏడాది మే 7న ఈ ఆపరేషన్ ప్రారంభమైంది.
సైన్యం హెచ్చరిక
ఈ సందర్భంగా విడుదలైన వీడియోలలో భారత సైన్యం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. “ప్రతి ఉగ్రవాదిని, వారి వెనుక ఉన్న సూత్రధారులను భారత్ గుర్తించి తీరుతుంది.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించింది. వైమానిక దళం విడుదల చేసిన వీడియోలో భారత్ దేనినీ క్షమించదు అనే నినాదం హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియోలలో సైనిక దళాల సమీకరణ, అత్యాధునిక యుద్ధ విమానాల గర్జనలు, ఉగ్రవాద స్థావరాలను క్షిపణులతో ఛేదించే దృశ్యాలు భారతీయులలో దేశభక్తిని నింపుతున్నాయి.
వ్యూహాత్మక విజయం
గత ఏడాది మే 7న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మన దళాలు విరుచుకుపడ్డాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం ఈ మిషన్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. జనసంచారం లేని ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎటువంటి పౌర నష్టం జరగకుండా అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో డ్రోన్ టెక్నాలజీ, సాటిలైట్ ఇమేజింగ్‌ను సమర్థవంతంగా ఉపయోగించారు. తాజాగా సైన్యం విడుదల చేసిన సాటిలైట్ చిత్రాలు ఉగ్రవాద శిబిరాలు ఏ స్థాయిలో ధ్వంసం అయ్యాయో స్పష్టం చేస్తున్నాయి.
బాధితులకు దక్కిన న్యాయం
పహల్గామ్ దాడుల వల్ల మానసిక క్షోభకు గురైన బాధితులకు ఈ ఆపరేషన్ ఒక ఊరటను ఇచ్చింది. శత్రువు దేశంలోకి చొరబడి మరీ దాడి చేయడం ద్వారా భారత్ తన ప్రజల రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని నిరూపించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు అసమానమైనవి. ఉగ్రవాదంపై మనది జీరో టాలరెన్స్ పాలసీ అని పునరుద్ఘాటించారు.
Operation Sindoor Justice served. Precise in action, eternal in memory—Operation Sindoor continues. India forgets nothing-India forgives nothing.#operation #Sindoor #operationsindoor #IAF @PMOIndia@rajnathsingh@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi… pic.twitter.com/GWvnY9Udjl
— Indian Air Force (@IAF_MCC) May 6, 2026
