రైతన్నకు మస్త్ పైసల్ ఆదా.. పురుగులు, తెగుళ్లను తరిమికొట్టే మందులను ఇంట్లోనే ఇలా తయారుచేసుకోండి..
వేలకు వేలు పోసి రసాయన పురుగుమందులు కొని అప్పులపాలవుతున్నారా? భూమి సారాన్ని, జేబును గుల్ల చేసే ఆ విషపు మందులకు స్వస్తి పలికే సమయం వచ్చింది. మన పెరట్లో, పల్లెల్లో ఉచితంగా దొరికే వేప, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గోమూత్రంతో ఇంట్లోనే తయారుచేసుకోగల 5 అద్భుత సహజ ద్రావణాలు చీడపురుగులను సమర్థవంతంగా తరిమికొడతాయి. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వ్యవసాయంలో విచ్చలవిడిగా వాడుతున్న రసాయన పురుగుమందుల వల్ల పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా భూసారం దెబ్బతిని, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అంతేకాకుండా రసాయన అవశేషాలు పంటల ద్వారా మానవ శరీరంలోకి చేరి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుండటంతో పర్యావరణ సమతుల్యత సైతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా పల్లెల్లో మన చుట్టూ సులభంగా లభించే వేప, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆవు మూత్రం వంటి సహజసిద్ధ వనరులతో శక్తివంతమైన బయో పెస్టిసైడ్స్ తయారు చేసుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి ఖర్చును దాదాపు సున్నా స్థాయికి తగ్గించే ఈ సహజ మందులు రసం పీల్చే పురుగులు, కాండం తొలిచే గొంగళి పురుగులు, తీవ్రమైన బూజు తెగుళ్లను సైతం సమర్థవంతంగా అరికట్టి భూమిని, పంటను పదిలంగా కాపాడతాయి.
రైతులు స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకోగల 5 రకాల సహజ పురుగు నివారణ మందుల తయారీ విధానం
అగ్ని ద్రావణం
రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులను నివారించడానికి ఇది ఒక శక్తివంతమైన కషాయం.
కావలసిన పదార్థాలు: గోమూత్రం – 1 లీటరు, వేపాకులు – 500 గ్రాములు, పచ్చిమిరపకాయలు – 50 గ్రాములు, వెల్లుల్లి – 50 గ్రాములు, పొగాకు – 100 గ్రాములు.
తయారీ – వాడే విధానం: ఈ పదార్థాలన్నింటినీ ఒక మట్టి కుండలో వేసి బాగా మరిగించాలి. అనంతరం చల్లార్చి వడకట్టుకోవాలి. ఈ ద్రావణాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి దాదాపు 10 సెంట్ల విస్తీర్ణంలో పంటపై పిచికారీ చేయవచ్చు.
ఐదు ఆకుల మందు
రకరకాల గొంగళి పురుగులు, తీవ్రమైన తెగుళ్లను తరిమికొట్టేందుకు ఇది ఉపకరిస్తుంది.
కావలసిన పదార్థాలు: వావిలి, ఉమ్మెత్త, జిల్లేడు, వేప ఆకులు, కలబంద.. ఒక్కొక్కటి 1 కిలో చొప్పున తీసుకోవాలి.
తయారీ – వాడే విధానం: వీటిని ముద్దగా నూరి 10 లీటర్ల గోమూత్రంలో కలపాలి. మట్టి లేదా ప్లాస్టిక్ పాత్రలో పోసి 15 రోజుల పాటు పులియబెట్టాలి. 15 రోజుల తర్వాత వడకట్టి, 10శాతం నిష్పత్తిలో (100 లీటర్ల నీటికి 10 లీటర్ల కషాయం) నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి.
వేప ద్రావణం:
మొక్కలకు సోకే తెల్లదోమ, పేనుబంక, చిన్న చిన్న గొంగళి పురుగుల నివారణకు ఇది ఉత్తమం.
కావలసిన పదార్థాలు: ఆవు పేడ – 2 కిలోలు, గోమూత్రం – 10 లీటర్లు, వేపాకులు మరియు ఈనెలు – 10 కిలోలు, నీరు – 200 లీటర్లు.
తయారీ విధానం: వేపాకులను బాగా నూరి 200 లీటర్ల నీటిలో కలపాలి. అందులోనే గోమూత్రం, ఆవు పేడ వేసి బాగా కలియతిప్పి 4 గంటల పాటు నానబెట్టాలి. మధ్యమధ్యలో కర్రతో కలియబెడుతుంటే వేప అస్త్రం సిద్ధమవుతుంది.
శొంఠి ద్రావణం:
పంటలను వేధించే వివిధ రకాల బూజు తెగుళ్లు, ఫంగస్ వ్యాధులను అరికట్టడానికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
కావలసిన పదార్థాలు: శొంఠి పొడి – 200 గ్రాములు, ఆవు పాలు – 5 లీటర్లు, నీరు – 200 లీటర్లు.
తయారీ విధానం: 200 గ్రాముల శొంఠి పొడిని 2 లీటర్ల నీటిలో వేసి మరిగించి, ఆ నీరు 1 లీటరు అయ్యేదాకా మరిగించాలి. మరోపక్క 5 లీటర్ల ఆవు పాలను కాచి చల్లార్చాలి. ఈ రెండింటినీ 200 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసుకుంటే ఫంగస్ తెగుళ్లు నశిస్తాయి.
3G ద్రావణం
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిల ఘాటుతో తయారయ్యే ఈ కషాయం పంటలపై తీవ్ర దాడి చేసే అన్ని రకాల గొంగళి పురుగులు, కాండం తొలిచే పురుగులను నిరోధిస్తుంది.
కావలసిన పదార్థాలు: అల్లం – 1 కిలో, వెల్లుల్లి – 1 కిలో, పచ్చిమిర్చి – 1 కిలో, గోమూత్రం – 6 లీటర్లు.
తయారీ – వాడే విధానం: అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిలను విడివిడిగా 2 లీటర్ల గోమూత్రం చొప్పున కలిపి ముద్దగా రుబ్బుకోవాలి. అనంతరం ఆ మూడింటినీ ఒకే పాత్రలో కలిపి 16 రోజుల పాటు పులియబెట్టాలి. బాగా పులిసిన తర్వాత వడకట్టి, 5శాతం మోతాదులో (100 లీటర్ల నీటికి 5 లీటర్ల కషాయం) కలిపి పంటలపై పిచికారీ చేయాలి.
ఈ దేశీ పద్ధతుల ద్వారా సాగు వ్యయం గణనీయంగా తగ్గడమే కాకుండా పంట నాణ్యత పెరిగి పర్యావరణహితమైన ఆరోగ్యకరమైన దిగుబడులు లభిస్తాయి.
