AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లోని ఫ్రిజ్ నెలకు ఎంత కరెంట్ వాడుతుంది..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో మస్త్ పైసల్ ఆదా..

కరెంట్ బిల్లు చూసి ప్రతి నెలా షాక్ అవుతున్నారా? అయితే మీ ఇంట్లో 24 గంటలూ రన్ అయ్యే ఫ్రిజ్ ఎంత కరెంట్ లాగేస్తుందో ఎప్పుడైనా గమనించారా? ఫ్రిజ్ రోజంతా నడిచినా కంప్రెసర్ నిరంతరం పనిచేయదన్న నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఒక సాధారణ ఫ్రిజ్ రోజుకు ఎన్ని యూనిట్ల విద్యుత్‌ను వాడుకుంటుంది? చిన్న చిన్న తప్పుల వల్ల కరెంట్ బిల్లు రెట్టింపు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..

మీ ఇంట్లోని ఫ్రిజ్ నెలకు ఎంత కరెంట్ వాడుతుంది..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో మస్త్ పైసల్ ఆదా..
24 Hour Refrigerator Power Consumption
Krishna S
|

Updated on: Oct 16, 2026 | 6:41 PM

Share

ఇంట్లో ఉండే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ అవసరం ఉన్నప్పుడే ఆన్ చేసుకుంటాం. కానీ ఫ్రిజ్ మాత్రం సంవత్సరం పొడవునా.. రోజుకు 24 గంటలూ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. కూరగాయలు, పాలు, మిగిలిన ఆహారం పాడవకుండా తాజాగా ఉండాలంటే ఫ్రిజ్ తప్పనిసరి. అయితే రోజంతా నడిచే ఫ్రిజ్ వల్ల ప్రతినెలా ఎన్ని యూనిట్ల కరెంట్ ఖర్చవుతుంది? ఎంత బిల్లు పడుతుంది? అనే విషయంపై చాలామందికి సరైన స్పష్టత ఉండదు. ఫ్రిజ్ వాడేటప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కరెంట్ బిల్లు ఊహించని రీతిలో పెరిగిపోతుంది. అసలు ఫ్రిజ్ విద్యుత్ వినియోగం దేనిపై ఆధారపడి ఉంటుంది? బిల్లును అదుపులో ఉంచుకోవడం ఎలాగో తెలుసుకోవడం ముఖ్యం.

ఫ్రిజ్ 24 గంటలూ నడిచినా.. కంప్రెసర్ నిరంతరం పనిచేయదు..

చాలామంది ఫ్రిజ్ 24 గంటలూ కరెంట్ వాడుకుంటుందని భయపడుతుంటారు. కానీ వాస్తవానికి ఫ్రిజ్ నిరంతరం నడుస్తున్నప్పటికీ, అందులోని ప్రధాన భాగమైన కంప్రెసర్ ప్పుడూ పనిచేయదు. ఫ్రిజ్ లోపల మనం సెట్ చేసిన ఉష్ణోగ్రత వచ్చేవరకు మాత్రమే కంప్రెసర్ పనిచేస్తుంది. సరైన చల్లదనం రాగానే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. లోపల ఉష్ణోగ్రత మళ్లీ పెరిగినప్పుడు మాత్రమే కంప్రెసర్ ఆన్ అవుతుంది. అందుకే సాధారణ 2 స్టార్ లేదా 3 స్టార్ ఫ్రిజ్ రోజుకు సగటున 0.8 నుండి 1.5 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. అదే ఆధునిక 4 స్టార్ లేదా 5 స్టార్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఫ్రిజ్ అయితే రోజుకు 0.5 నుండి 0.8 యూనిట్ల విద్యుత్‌తోనే సరిపెట్టుకుంటుంది.

నెలకు ఫ్రిజ్ వల్ల ఎంత ఖర్చవుతుంది?

ఒక మధ్యతరగతి ఇంట్లో ఉండే సింగిల్ లేదా డబుల్ డోర్ ఫ్రిజ్ విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే.

సగటున రోజుకు 1 యూనిట్ వాడితే: నెలకు సుమారు 30 యూనిట్లు ఖర్చవుతుంది. యూనిట్ విద్యుత్ ఛార్జీని సుమారు రూ. 7 నుండి రూ. 8 గా లెక్కిస్తే.. నెలకు కేవలం ఫ్రిజ్ కోసమే రూ. 210 నుండి రూ. 240 వరకు ఖర్చవుతుంది.

పాత మోడల్ లేదా ఎక్కువ వాడకంతో రోజుకు 1.5 యూనిట్లు వాడితే: నెలకు 45 యూనిట్లు ఖర్చవుతాయి. అంటే నెలకు దాదాపు రూ. 360 పైమాటే.

ఫ్రిజ్ కరెంట్ వినియోగం దేనిపై ఆధారపడి ఉంటుంది?

స్టార్ రేటింగ్: 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిజ్ అతి తక్కువ విద్యుత్‌ను వాడుకుంటుంది. 1-స్టార్ లేదా పాత మోడల్ ఫ్రిజ్‌లు రెట్టింపు విద్యుత్‌ను లాగేస్తాయి.

ఇన్వర్టర్ టెక్నాలజీ: సాధారణ ఫ్రిజ్‌లలో కంప్రెసర్ ఆన్-ఆఫ్ మోడ్‌లో నడుస్తుంది. కానీ డిజిటల్ ఇన్వర్టర్ ఫ్రిజ్‌లలో అవసరమైన కూలింగ్ సామర్థ్యాన్ని బట్టి కంప్రెసర్ స్పీడ్ మారుతూ ఉంటుంది కాబట్టి విద్యుత్ చాలా ఆదా అవుతుంది.

వాతావరణం – పరిమాణం: ఎండాకాలంలో బయట వేడి ఎక్కువగా ఉండటం వల్ల కంప్రెసర్ ఎక్కువ సమయం పనిచేస్తుంది. అలాగే 300+ లీటర్ల డబుల్ డోర్ ఫ్రిజ్.. 190 లీటర్ల సింగిల్ డోర్ ఫ్రిజ్ కంటే ఎక్కువ కరెంట్‌ను వినియోగిస్తుంది.

కరెంట్ బిల్లు తగ్గించే గోల్డెన్ టిప్స్..

డోర్ మాటిమాటికీ తెరవకండి: ఫ్రిజ్ తలుపులు పదేపదే తీయడం వల్ల లోపలి చల్లటి గాలి బయటకు వెళ్లిపోయి, తిరిగి కూలింగ్ చేయడానికి కంప్రెసర్‌పై అదనపు భారం పడుతుంది.

వేడి పదార్థాలు పెట్టకండి: వండిన వెంటనే వేడివేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అవి గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాతే లోపల ఉంచాలి.

డోర్ రబ్బర్ చెక్ చేయండి: ఫ్రిజ్ డోర్ చుట్టూ ఉండే రబ్బర్ లూజ్ అయితే లోపలి గాలి బయటకు లీక్ అవుతుంది. డోర్ మధ్యలో ఒక కాగితాన్ని ఉంచి మూసినప్పుడు, అది సులభంగా బయటకు లాగగలిగితే రబ్బర్ మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం.

గోడకు కాస్త దూరంగా ఉంచండి: ఫ్రిజ్ వెనుక భాగం వేడిని విడుదల చేస్తుంది. అందుకే గోడకు కనీసం 6 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల గాలి ప్రసరణ బాగుండి కంప్రెసర్ త్వరగా చల్లబడుతుంది.

డిఫ్రాస్ట్ క్రమం తప్పకుండా చేయండి: ఫ్రీజర్‌లో మంచు ఎక్కువగా పేరుకుపోతే కూలింగ్ తగ్గి కరెంట్ వినియోగం పెరుగుతుంది. కనుక క్రమం తప్పకుండా డీఫ్రాస్ట్ చేయాలి.

Follow Us