Maruti Suzuki: ఆ ఘనత సాధించిన తొలి మారుతీ సుజుకీ కారు ఇదే..
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మారుతీ సుజుకీ కొత్త డిజైర్ కారును లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైన ఈ కారు ధరను నవంబర్ 11వ తేదీన ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కారు ఎన్‌క్యాప్ టెస్టులో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మారుతీ సుజుకీ నుంచి తొలి కారుగా నిలిచింది..
కార్లకు ఇచ్చే సేఫ్టీ రేటింగ్ ప్రకారం వాటి డిమాండ్ ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అందుకే కారు కొనుగోలు చేసే సేఫ్టీ రేటింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ విషయంలో మారుతీ సుజుకీ ఎప్పటినుంచే పలు విమర్శకుల ఎదుర్కొంటోంది. ఇతర కార్లతో పోల్చితే మారుతి సుజుకీ సేఫ్టీ విషయంలో వెనకబడి ఉంటుందనే వాదన వినిపిస్తూనే ఉంటుంది.
అయితే ఈ విషయంలో తాము తక్కువేం కాదని నిరూపించింది మారుతి. తాజాగా మార్కెట్లోకి తీసుకొస్తున్న మారుతీ సుజుకీకి చెందిన ఫోర్త్ జనరేషన్ డిజైర్ అరుదైన ఘనత సాధించింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కాంపాక్ట్ సెడాన్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. పెద్దల భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్, చిన్నారుల భద్రతకు సంబందించి 4 స్టార్ పొందిందీ కారు. గ్లోబల్ ఎన్‌క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి మారుతీ సుజుకీ కారు ఇదే కావడం గమనార్హం.
మారుతీ ఈ వాహనాన్ని స్వచ్ఛంధంగా క్రాష్ టెస్ట్‌కు పంపింది. ఇందులో భాగంగానే పెద్దల భద్రతకు సంబంధించి 34 పాయింట్లకు గాను 31.24 పాయింట్లను దక్కించుకుంది. అలాగే చిన్నారుల భద్రత విషయానికొస్తే 42 పాయింట్లకు గాను 39 పాయింట్లు సాధించింది. ఈ కొత్త కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్ విత్ రిమైండర్‌ను అందించారు.
ఇక కొత్త మారుతి డిజైర్ విషయానికొస్తే ఈ కారు.. ఇంటీరియర్‌లో అనేక మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ కార్లకు సంబంధించి బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. ఇంకా కారు ధరలను కంపెనీ నిర్ణయించలేదు. నవంబర్ 11వ తేదీన ఈ ధరలను వెల్లడించనున్నారు. ధర ప్రకటించే ముందు ఈ టెస్ట్ వివరాలు వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..