రైతు అన్ని విధాలుగా లాభపడాలి – సీఎం కేసీఆర్

|

Sep 01, 2020 | 3:05 PM

తెలంగాణ రైతులు నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలోని రైతులంతా వందకు వందశాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నది తన అభిమతమన్నారు.

రైతు అన్ని విధాలుగా లాభపడాలి - సీఎం కేసీఆర్
Follow us on

తెలంగాణ రైతులు నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలోని రైతులంతా వందకు వందశాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నది తన అభిమతమన్నారు. నూతన వ్యవసాయ విధానంపై ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి అధ్యక్షులతో సీఎం కేసీఆర్‌ చర్చించి పలు సూచనలు చేశారు. రైతులంతా ఒకే పంట వేయడం ద్వారా డిమాండ్‌ పడిపోయినప్పుడు నష్టపోతున్నారని, ఈ పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి, నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేయాలని సూచిస్తున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు.
మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న నాణ్యమైన పంటలు పండించడం ద్వారానే రైతులు మంచి ధర పొందగలుగుతారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఏ పంట వేయడం ద్వారా మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగిన సూచనలు తీసుకోవాలన్నారు. తద్వారా పంట సాగు చేస్తే రైతులకు ఏ ఇబ్బంది ఉండదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడే రైతాంగంలా మారాలి. ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తులు అందించి లాభాలు గడించాలన్నారు.
ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి..? ఎక్కడ ఏ పంట సాగు చేయాలి..? ఏ రకం సాగు చేయాలనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉందో ఆగ్రో బిజినెస్‌ విభాగం వారు తేల్చారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగిన సూచనలు చేస్తుందని, ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉండదని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు.