సూపర్ టార్గెట్ పై జగన్ నజర్.. 2022 నాటికి..?
నాలుగు నెలల క్రితం అధికారం చేపట్టి.. ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో ఉన్నత లక్ష్యంపై కన్నేశారు. రెండున్నర ఏళ్ళలో సాధించాలన్న లక్ష్యంతో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం శుక్రవారం ఏపీ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాద్, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొనగా.. 2022 నాటి సాధించాల్సిన లక్ష్యం గురించి […]
నాలుగు నెలల క్రితం అధికారం చేపట్టి.. ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో ఉన్నత లక్ష్యంపై కన్నేశారు. రెండున్నర ఏళ్ళలో సాధించాలన్న లక్ష్యంతో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం శుక్రవారం ఏపీ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాద్, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొనగా.. 2022 నాటి సాధించాల్సిన లక్ష్యం గురించి వివరించారు ఏపీ సీఎం జగన్.
ఇంతకీ లక్ష్యం ఏంటంటే..?
2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. సుమారు రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలు చేయాలని ఆదేశించారు. 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ డిజైన్ చేయాలని నిర్దేశించారు. 46,982 గ్రామీణ ప్రాంత హ్యాబిటేషన్లకు, 99 అర్బన్ ఏరియాలకు తాగునీటి సరఫరా చేయాలని టార్గెట్ ఖరారు చేశారు. రెండు దశల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలు చేయాలని భావిస్తున్నారు. మొదటి దశలో రూ.37,475 కోట్లు, రెండో దశలో రూ.9,200 కోట్లు వ్యయం చేయాలని తలపెట్టారు సీఎం జగన్. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ లక్ష్య సాధన కోసం ఎషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ద్వారా రూ.2500 కోట్ల రుణం తీసుకోవాలని భావిస్తున్నారు.
లక్ష్య సాధనలో కీలకాంశాలివే..
రాష్ట్రంలోని 110 అర్బన్ లోకల్ బాడీస్ (యుఎల్‌బిఎస్) లకు 1418.49 ఎంఎల్‌డిల నీరు సరఫరా..
రిజర్వాయర్ల నుంచి తాగునీటి అవసరాలకు పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా..
వర్షాభావం కారణంగా అడుగంటుతున్న భూగర్భజలాలు..
అనంతపురం, చిత్తూరుజిల్లాల్లో 1100 అడుగులకు పడిపోయిన భూగర్భజలాలు..
శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంజిల్లాల్లో దీర్ఘకాలంగా భూగర్భజలాల వినియోగం..
ఈ మూడు జిల్లాల్లో సర్ఫేస్ వాటర్ సరఫరాకు సత్వర చర్యలు..
గోదావరిజిల్లాల్లో ఆక్వా కల్చర్ కారణంగా భూగర్భ జలాలు కలుషితం..
ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ల ద్వారా తాగునీటిని అందించేందుకు ప్రణాళిక..
కడప, నెల్లూరు జిల్లాల్లో మండు వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి..
చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి నాణ్యతలో ఇబ్బందులు..
చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో గణనీయంగా పెరిగిన ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే హ్యాబిటేషన్ల సంఖ్య..
ఈ జిల్లాల్లో 2011లో 591 హ్యాబిటేషన్లు వుండగా, ఈ ఏడాదికి 6267 హ్యాబిటేషన్లకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా..
వర్షపాతం లోటు కారణంగా రాయలసీమ జిల్లాల్లో ఎండిపోతున్న బోరుబావులు..
వాటర్ గ్రిడ్ ద్వారా రిజర్వాయర్‌ల నుంచి ఈ ప్రాంతానికి తాగునీటి సరఫరా..
గిరిజన గ్రామాలకు కూడా సురక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు..
నదులు, నీటి వనరులు, రిజర్వాయర్ల ద్వారా వాటర్ గ్రిడ్‌కు నీటి లభ్యత..
లక్ష్య సాధన ఎలా అంటే..?
జలజీవన్ మిషన్, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకాలను వినియోగించుకోవడం ద్వారా ఇంటింటికీ కుళాయి అనే పథకాన్ని విజయవంతంగా అమలు పరచాలని జగన్ నిర్ణయించారు. తాగునీటికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులకు వివరించారు. జిల్లాల్లో జలాశయాలు, నదులు, నీటివనరుల లభ్యతపై సమగ్ర అంచనాలు తయారు చేయాలని మంత్రులను ఆదేశించారు సీఎం జగన్. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటిసరఫరాలో సమతూల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.