శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దులో ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. రాజౌరీ జిల్లాలోని సుందర్‌బానీ సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. కాగా ఆదివారం కూడా రాజౌరీలో పాకిస్థాన్ కాల్పులు జరిపింది. దీంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో.. ముందస్తు జాగ్రత్తగా సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.