పుష్కలంగా జీతాలందుకుంటూనే అధికారుల కమీషన్లు, లంచాల కక్కుర్తి, వైరల్‌ అవుతున్న మున్సిపాలిటీ అధికారుల ఆడియో టేపులు

మంచిర్యాల మున్సిపాలిటీలో కమీషన్ల గొడవ రచకెక్కింది. బిల్లుల చెల్లింపు కోసం మున్సిపల్ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడిన వైనం వెలుగుచూసింది. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, ఇతర అత్యవసర..

పుష్కలంగా జీతాలందుకుంటూనే అధికారుల కమీషన్లు, లంచాల కక్కుర్తి, వైరల్‌ అవుతున్న మున్సిపాలిటీ అధికారుల ఆడియో టేపులు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 25, 2021 | 2:08 PM

మంచిర్యాల మున్సిపాలిటీలో కమీషన్ల గొడవ రచకెక్కింది. బిల్లుల చెల్లింపు కోసం మున్సిపల్ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడిన వైనం వెలుగుచూసింది. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, ఇతర అత్యవసర పనులను టెండర్లు, నామినేషన్ పద్ధతుల్లో కాంట్రాక్టర్లకు అప్పగిస్తుండగా… అధికారులు చేతివాటం ప్రదర్శించారు. వారికి బిల్లులను మంజూరు చేయడంలో బిల్లు మంజూరు చేసే సమయంలో కమీషన్లు ఇవ్వనిదే బిల్లు పాస్ కాదంటూ అడ్డుపడ్డారు. ఇప్పుడు కాంట్రాక్టర్ల మధ్య జరిగిన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాం కుమార్‌కు… జేసీబీ కాంట్రాక్టర్ వాషింగ్ మిషన్ నజరానా ఇచ్చారు. సోడియం హైపోక్లో రైడ్ ద్రావణం సరఫరా బిల్లు మంజూరు చేసేందుకు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనిత డబ్బులు డిమాండ్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి కాంట్రాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా… మున్సిపాలిటీ ఉద్యోగులకు ఎంత కమీషన్ ఇవ్వాలో తమకు తెలుసునని, ఇష్టమొచ్చినంత ఎలా అడుగుతారని సదరు కాంట్రాక్టర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అయితే.. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం జిల్లాకు ఏటా రూ. 75.71 లక్షలు నిధులు కేటాయిస్తోంది. వాటిలో సగం వరకు అత్యవసర పనుల నిమిత్తం మంచిర్యాల మున్సిపాలిటీకి విడుదల చేస్తున్నారు. మున్సిపాలిటీకి జేసీబీ లేకపోవడంతో ప్రైవేటు వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే చేసిన పనికంటే బిల్లులు ఎక్కువ రాసి… అందులో కమీషన్లు పంచుకుంటున్నారన్న ఆరోపణలు ముందునుంచీ ఉన్నాయి. తాజా ఆడియో టేపులు బయటపడడంతో అధికారులు విచారణ జరుపుతున్నారు.

Read also : 9 – 11 తరగతుల విద్యార్థులు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి