వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డికి ఇస్తామన్న ప్రాణహిత నీళ్లు ఇంతవరకూ ఇవ్వలేదని ఆయన ఆరోపిస్తున్నారు. జీవో 111 తీసేస్తామన్న హామీ తెలంగాణ సర్కార్ మరిచిందన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయలేదని విమర్శించారు విశ్వేశ్వర్ రెడ్డి. ఉమ్మడి రంగారెడ్డికి రావాల్సిన నిధుల్ని వేరే జిల్లాలకు మళ్లించారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఇలా రంగారెడ్డి జిల్లాలో పెండింగ్ సమస్యలపై కొండా దీక్షకు దిగారు. ఆయనకు సంఘీభావంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.