టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల హఠాన్మరణం.. గుండెపోటుతో మృతి.. గ్రేటర్ పోలింగ్ రోజున అధికార పార్టీలో విషాదం..
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందారు. అపోలో ఆసుపత్రిలో ఆయన మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.
TRS MLA Nomula sudden death: తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందారు. చిరకాలం పాటు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తరపున రాజకీయాల్లో పని చేసిన నోముల నర్సింహయ్య కొన్నేళ్ళ క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. 2018 ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. మంగళవారం తెల్లవారుజామున నోముల నర్సింహయ్యకు గుండెపోటు వచ్చి హఠాన్మరణం పాలైనట్లు సమాచారం. కొద్ది నెలలుగా నోముల అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రితో చికిత్స పొందుతున్న నోముల.. మంగళవారం తెల్లవారుజామున మరణించారు.
నకిరేకల్ కోర్టులో న్యాయవాదిగా పని చేసిన నోముల ఆ తర్వాత అక్కడి నుంచే సీపీఎం పార్టీ తరపున శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1999, 2004లో సీపీఎం పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికైన నోముల.. 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసిన నోముల.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిపై అనూహ్య విజయం సాధించి.. మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఎమ్మెల్యే శ్రీ నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పని చేసిన నాయకుడిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) December 1, 2020
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి అకాల మరణం వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులు నోముల నర్సింహయ్య గారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/y6lm4KdxJQ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 1, 2020