చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిందో దారుణం.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన రవి చైతన్య అనే వ్యక్తి తన భార్య ఆమని హత్యకు పథకం పన్నాడు. ఆరోగ్యం కోసం ఆమె తీసుకుంటున్న మందుల్లో రహస్యంగా సైనైడ్ కలిపాడు. ఆమని గత నెల 27 న మరణించింది. ఆన్ లైన్ ద్వారా రవి సైనైడ్ తెప్పించుకుని దాన్ని ఆమని వేసుకునే టాబ్లెట్లలో కలపడంతో ఆమె మృతి చెందింది. మొదట ఆమె మృతిని అనుమానాస్పద ఘటనగా భావించిన పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేయడంతో షాకింగ్ వాస్తవాలు వెల్లడయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజరుగా పని చేస్తున్న రవి చైతన్య.. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తనకు అడ్డుగా ఉందని భావించి భార్యను హత్య చేసేందుకు కుట్ర పన్నాడని తెలిసింది. మొదట ఆమని కాలు జారి పడిపోయిందని తన అత్తమామలకు చెప్పాడని, అయితే ఇందులో ఏదో మర్మం ఉందని భావించిన ఆమని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. . ఖాకీలు తమదైన స్టయిల్లో విచారణ జరిపేసరికి రవి ఘాతుకం బయటపడింది. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.