హైదరాబాద్: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాల విడుదల నిలుపుదలకు కోరుతూ వేసిన పిటీషన్‌పై హైకోర్టు స్పందించింది. సినిమాలను నిలుపివేయడానకి కోర్టు నిరాకరించింది. ఎన్నికల కారణంగా ఈ రెండు సినిమాల విడుదల నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సత్యనారాయణ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సినిమాల విడుదలలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
సెన్సేషనల్ దర్శకడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు దర్శకత్వం వహించగా…లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. విశ్వ విఖ్యాత ఎన్టీఆర్ జీవితంలోకి ఆయన రెండవ భార్య లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జీవితం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించినట్టు వర్మ తెలిపారు. లక్ష్మీ పార్వతిగా కన్నడ నటి యజ్ఞ శెట్టి నటించారు. కీరవాణి సోదరుడు కల్యాణి మాలిక్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. మార్చి 29న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు వర్మ మంగళవారం ఉదయం ప్రకటించారు.