AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్.. కరోనా వైరస్.. లక్షా 70 వేల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ.. నిర్మలా సీతారామన్

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుండడంతో, ముఖ్యంగా వలస పోతున్న శ్రామిక జీవులను, రోజువారీ కూలీలను , చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది.

బ్రేకింగ్.. కరోనా వైరస్.. లక్షా 70 వేల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ.. నిర్మలా సీతారామన్
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 26, 2020 | 2:38 PM

Share

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుండడంతో, ముఖ్యంగా వలస పోతున్న శ్రామిక జీవులను, రోజువారీ కూలీలను , చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం  ఈ విషయాన్ని పేర్కొంటూ.. లక్షా 70 వేల కోట్లతో భారీ ఎకనామిక్ ప్యాకేజీని అమలు చేయబోతున్నట్టు వెల్లడించారు. దేశంలో ఏ వ్యక్తి కూడా ఆకలి బాధకు గురి కాకూడదని అంటూ ఆమె.. ఫుడ్ స్కీమ్ ఫర్ 80 క్రోర్ పూర్ అనే పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా 80 కోట్ల మంది పేదలకు ఈ పథకం కింద ఆహారం అందుతుందన్నారు. అలాగే  పట్టణ ప్రాంత పేదలకు (అర్బన్ రూరల్), మైగ్రెన్ట్ వర్కర్లకు ఈ పథకం మేరకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ‘నో బడీ విల్ గో హంగ్రీ’ (ఎవరూ ఆకలికి గురికారాదు) అని ఆమె పదేపదే వ్యాఖ్యానించారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద మరిన్ని పథకాలను ప్రకటించే యోచన ఉందన్నారు. కరోనా వైరస్ అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కునారిల్లంపజేసిందని, ఈ ఉద్దీపన ప్యాకేజీ కింద వాటిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిధ్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

జాతీయ ఆహార చట్టం కింద వచ్ఛే మూడు నెలలకు గాను పేదలకు ఉచితంగా.. అదనంగా 5 కేజీల గోధుమపిండి, బియ్యం,  పప్పులు అందుతుందని, కరోనా రోగుల సేవలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయాన్ని కల్పిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. జన్ ధన్ ఖాతాలు  కలిగిన మహిళలకు నెలకు 500 రూపాయల ఎక్స్-గ్రేషియా అందుతుందని, రైతులకు రూ. 6 వేల తొలి విడత చెల్లింపులు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేకంగా దేశంలోని 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్దిదారులకు నేరుగా సాయం అందుతుంది. స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి రూ. 10 లక్షలకు పెంచుతున్నాం.. దీని ద్వారా 63 లక్షల స్వయం సహాయక బృందాలకు ప్రయోజనం కలుగుతుంది అని ఆమె వివరించారు. ఉపాధి హామీ వేతనాలను రూ. 182 నుంచి రూ. 202 కు పెంచుతున్నామని, రూ. 15 వేల లోపు వేతనం పొందుతున్నవారికి ఈ పీ ఎఫ్ ఫండ్ ను కేంద్రమే భరిస్తుందని ఆమె వివరించారు. మూడు కోట్ల మంది వితంతువులకు పెన్షనర్లకు, దివ్యంగులకు వెయ్యి రూపాయల చొప్పున ఎక్స్-గ్రేషియా అందుతుందని, బీపీఎల్ కింద  ఉన్న 8.3 కోట్ల కుటుంబాలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని నిర్మల వెల్లడించారు. అంటే నిరుపేదల కుటుంబాల్లో నవ్వులు పంచడమే తమ ధ్యేయమన్నారు.

బెయిల్ ఔట్ ప్యాకేజీ ప్రకటనకు ముందే..చర్యలు

కరోనా నేపథ్యంలో దేశమంతా 21 రోజుల పాటు  లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా ప్రజాజీవనం స్తంభిపోయింది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాలాడుతున్నారు. దీంతో దేశ ఆర్ధిక వ్యవస్థ మున్నెన్నడూ లేనంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుండడంతో కేంద్రం ఉద్దీపన చర్యలకు నడుం కట్టింది. బెయిల్ ఔట్ ప్యాకేజీని రూపొందించింది. రోజువారీ వేతన కూలీల సంక్షేమం కోసం మార్కెట్ పునరుజ్జీవం కోసం దీన్ని ఉద్దేశించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇదివరకే రిజర్వ్ బ్యాంకు తోను, సెబీ తోను సంప్రదింపులు జరిపింది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యాన ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ఇదివరకే ప్రకటించారు. రానున్న నెలల్లో ఎకానమీ మరింత దిగజారుతుందని ఆందోళన చెందిన సర్కార్.. ఆర్ధిక మాంద్యం ఏర్పడకుండా చూసేందుకు మరిన్ని చర్యల ఆవశ్యకతను గుర్తించింది. ఇందులో భాగంగా ఆదాయంపన్ను రిటర్నుల దాఖలు గడువును మరో మూడు నెలలకు పొడిగించడం, ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా కు చార్జీలను మాఫీ చేయడం,ఇన్ సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ను లక్ష రూపాయల నుంచి ఒక కోటి రూపాయలకు పెంచడం వంటి చర్యలను చేబట్టింది.