AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐబీ చీఫ్‌ ఎంపికపై అయోమయం.. జగన్ మదిలో కొత్త ఆఫీసర్ !

5 నెలలు గడుస్తున్నా ఏపీ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకం జరగలేదు. అసలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో ఏముందనేదే తెలియడం లేదు. నిజానికి అధికార పగ్గాలు చేపట్టగానే తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకుని, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టాలని జగన్ భావించారు. దానికోసం ఆయన స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌ను స్వయంగా కోరడం.. ఆయన అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఈ […]

ఐబీ చీఫ్‌ ఎంపికపై అయోమయం.. జగన్ మదిలో కొత్త ఆఫీసర్ !
Rajesh Sharma
|

Updated on: Oct 17, 2019 | 4:02 PM

Share

5 నెలలు గడుస్తున్నా ఏపీ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకం జరగలేదు. అసలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో ఏముందనేదే తెలియడం లేదు. నిజానికి అధికార పగ్గాలు చేపట్టగానే తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకుని, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టాలని జగన్ భావించారు. దానికోసం ఆయన స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌ను స్వయంగా కోరడం.. ఆయన అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఈ తంతు పూర్తై నాలుగు నెలల గడిచిపోయింది. అయితే ఇప్పటి వరకు ఏపీ ఐబీ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియామకపు ఉత్తర్వులు వెలువడలేదు.

కారణాలను అన్వేషిస్తే.. కేంద్ర హోం శాఖ మోకాలడ్డడమే కారణమని తేలింది. తెలంగాణ క్యాడర్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ బదిలీ చేయడమో లేక డిప్యూటేషన్‌పై పంపడమో చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల కేంద్ర హోం శాఖను కోరాయి. జూన్ రెండో వారంలోనే ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశాయి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. కానీ.. వీరి అభ్యర్థనను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోతుగా పరిశీలించేందుకు తన దగ్గరే అట్టి పెట్టేసుకున్నారని సమాచారం.

సుమారు రెండు నెలల తర్వాత ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి ఏపీకి ఇవ్వడం కుదరదని కేంద్ర హోం శాఖ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. కారణాలపై ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలు తెరమీదికొచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీఎంవోలోను, ఆయన సొంత టీమ్‌లోను ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో పోలరైజ్ అవుతున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ ‌అధికారులు నివేదిక ఇవ్వడంతో అమిత్ షా కాస్త లోతుగా పరిశీలించాలని భావించినట్లు సమాచారం. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తెలుగు ప్రభుత్వాల అభ్యర్థనను తోసిపుచ్చాలని అమిత్ షా భావించినట్లు తెలుస్తోంది.

సో.. కేంద్ర హోం శాఖ తిరస్కారంతో ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఇక తెలంగాణకే మిగిలిపోనున్నారు. మరి ఆయనొక్కరు కాకపోతే ఏపీ క్యాడర్‌లో ఐబి చీఫ్ బాధ్యతలు చేపట్టే స్థాయి అధికారు లేరా ? మరి జగన్ మదిలో ఎవరున్నారు ? ఇపుడు ఏపీ పాలిటిక్స్‌లోను, ఏపీ పోలీసుల్లోను ఈ చర్చ హాట్ హాట్‌గా జరుగుతోంది. ఈ విషయంలో జగన్ ఇప్పటికే ఏపీ డిజిపి గౌతమ్ సావంగ్‌తో పలు దఫాలు సమాలోచనలు జరిపి సీనియర్ ఐపీఎస్ అధికారుల లిస్టు ప్రిపేర్ చేయించుకున్నారని తెలుస్తోంది.

ఎన్నికలు జరిగి 5 నెలలు కావస్తుండడం, అధికార వైసీపీ, విపక్ష టిడిపి నేతల మధ్య పలుచోట్ల ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటుండడం, విపక్ష నేతల పర్యటనలు జోరందుకోవడం, బిజెపి కమలాకర్ష్‌లో వైసీపీ నేతలను కూడా టార్గెట్ చేస్తుండడంతో తక్షణం ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా అనుభవిజ్హుడైన సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ అంతరంగంలో ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్యూరియాసిటీకి, ఉత్కంఠకు ఈ వారంలో తెరపడొచ్చని సమాచారం.