Big News Big Debate: దేశ రాజకీయాల్లో సోషల్‌ మీడియా ప్రభావం

Big News Big Debate: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరన్న సామెత నిజమే. ఇప్పుడు సోషల్‌ మీడియా పట్ల కూడా రాజకీయ పార్టీలు తీరు అలాగే ఉంటుందని తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు

Big News Big Debate: దేశ రాజకీయాల్లో సోషల్‌ మీడియా ప్రభావం
Tv9 Big News Big Debate
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 13, 2021 | 9:18 PM

Big News Big Debate: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరన్న సామెత నిజమే. ఇప్పుడు సోషల్‌ మీడియా పట్ల కూడా రాజకీయ పార్టీలు తీరు అలాగే ఉంటుందని తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి. నిన్నమొన్నటి దాకా ఐటీ యాక్ట్‌ సవరణపై సోషల్‌ మీడియాకు మద్దతుగా ప్రభుత్వంపై పెద్ద యుద్ధమే చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు రాహుల్‌ గాంధీ సహా 5వేలకు పైగా కాంగ్రెస్‌ ఖాతాలు బ్లాక్‌ చేయగానే రివర్స్‌ అయింది హస్తం. అంతా మోదీ చేతిలో చిక్కి బీజేపీ పాలసీ అమలుచేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు. గతంలో ట్విట్టర్‌పై బగ్గుమన్న బీజేపీ నాయకులు ఇప్పుడు శభేష్‌ అంటున్నారు.

ఏంజరిగింది:

ఢిల్లీలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని రాహుల్ గాంధీ కలిసిన ఫొటోలు, వీడియోలు ట్విటర్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని ప్రకటించిన సంస్థ ఆగస్టు 6న అకౌంట్లను లాక్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాతోపాటు రాహుల్ గాంధీ ఇతర నేతలు, కార్యకర్తలకు చెందిన మొత్తం 5వేలకు పైగా ఖాతాలకు ట్విట్టర్ ఇండియా లాక్ చేసింది. అప్పుడే మొదలైంది వార్‌..

కాంగ్రెస్‌ మాటలదాడి:

ట్విటర్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోదీ చేతిలో బొమ్మలా ట్విటర్ పిట్ట తయారైంద విమర్శిస్తున్నాయి. ట్విటర్‌ కూడా రాజకీయాలను నేర్పుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్‌ గాంధీ. ట్విట్టర్‌ చర్య దేశ రాజకీయాల్లో జోక్యమే. సోషల్ మీడియా పక్షపాతధోరణికి అద్దం పడుతోందన్నారు. ట్విట్టర్‌ తన సొంత పాలసీలను పాటిస్తోందా లేదంటే మోదీ ప్రభుత్వ నియమాలు పాటిస్తోందా అంటూ ప్రశ్నించారు ప్రియాంకాగాంధీ. ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు బీజేపీతో ట్విట్టర్ జతకట్టిందన్న భావన పెరిగిందన్నారు. అటు మోదీ ఒత్తిడి కారణంగానే ట్విటర్‌ ఖాతాలు నిలుపుదల చేసిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, బాధితులకు న్యాయం చేయమని అడగడం, ప్రభుత్వ తప్పిదాల్ని బహిరంగ పర్చడం కూడా తప్పేనా అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

గతంలోనూ ఇలాగే..

అయితే గతంలోనూ కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన రవిశంకర్ ప్రసాద్ ట్విటర్‌ ఖాతాను డీజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా బ్లాక్‌ చేసినట్టు బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

డేటా చెబుతున్న నిజం..

చాలాకాలంగా దేశంలో ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా ఆధిపత్యం పెరుగుతోంది. యూజర్లు పెరిగే కొద్దీ పార్టీలు కూడా వాటిని ఉపయోగించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం మొదలుపెట్టాయి. చివరకు వాటిపైనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. పార్టీలు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. సోషల్‌ మీడియా వింగ్‌లు తెరమీదకు వచ్చాయి. వేతనాలు ఇచ్చి మనీ ట్రెండింగ్‌ చేసే యూత్‌ను పెంచి పోషిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా వాటినే ఆధారంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన పార్టీలు.. ఇమేజ్‌ పెంచుకున్న నాయకుడు.. తర్వాత తమపై వచ్చే వ్యతిరేక వార్తలను చూసి తట్టుకోలేకపోతున్నారు. అంతే సులభంగా వాటిపై యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఐటీ సవరణ చట్టంపై పెద్ద దుమారమే రేగింది. సోషల్‌ మీడియా సంస్థలను నియంత్రించడానికి తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికే అంటూ విపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు ప్రతిపక్షం కూడా అదే సోషల్‌ మీడియా మితిమీరిన జోక్యం అంటూ పల్లవి అందుకుంది. అంటే అనుకూలంగా ఉంటే.. లేదంటే మరోలా మారింది. గతంలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి రావాలంటూ రాహుల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. ఒకప్పుడు అదే ఆయుధంగా భావించిన రాహుల్‌.. ఇప్పుడు రాజకీయాలు నేర్పుతుందనడం ఎంతవరకు సమంజసం. అంతకుముందు ఎలాంటి సందేశమైనా జనాలకు చేర్చే శక్తి మాకుంది. నిజమైనా, అబద్దమైనా నమ్మించగలం అని అమిత్‌ షా ఓ సందర్భంలో అన్నట్టు ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ కథనం రాసింది.

దేశంలో.. ఇండియా సోషల్‌ మీడియా లెక్కలు ( ప్రభుత్వ లెక్కల ప్రకారం)

జనాభా 139 కోట్లు ఇంటర్నెట్‌ యూజర్స్‌ 62.4 కోట్లు వాట్సాప్‌ యూజర్స్‌ 53 కోట్లు యూట్యూబ్‌ 44.8 కోట్లు ఫేస్‌ బుక్‌ 41 కోట్లు ఇన్‌స్టాగ్రామ్‌ 21 కోట్లు ట్విట్టర్‌ 1.5 కోట్లు

సోషల్ మీడియా కారణంగా సవాళ్లు..

దేశవ్యాప్తంగా సోషల్ మీడియా పెరగడం వల్ల సవాళ్లూ పెరుగుతున్నాయి. వాస్తవానికి తరచుగా అల్లర్లకు కారణమవుతాయని భావించి మొత్తం ఇంటర్నెట్‌నే బ్యాన్‌ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. గడిచిన 10 ఏళ్లలో ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ చేసిన సందర్భాలు చూస్తే అవగతమవుతుంది. దేశంలో ఇంటర్నెట్‌ షట్ డౌన్స్‌ 2012లో 3 2013లో 5 2014లో 6 2015లో 14 2016లో 34 2017లో 79 2018లో 134 2019లో 106 2020లో 129

మొత్తానికి మరోసారి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాపై పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. రాజకీయాల్లో జోక్యమని కాంగ్రెస్‌ అంటోంది.. నిబంబధనలు పాటిస్తే ఎవరైనా ఒక్కటే అంటోంది ట్విటర్‌ సంస్థ. మధ్యలో బీజేపీ దీనిపై ఆచితూచి స్పందిస్తోంది. ఇదే అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో ఎగ్జిక్యుటివ్ ఎడిటర్‌ మురళీకృష్ణ ప్రత్యేక చర్చ చేపట్టారు. పూర్తి సమాచారం కోసం కింద వీడియో క్లిక్‌ చేయండి.