వార ఫలాలు (ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 27, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యలో శుభ వార్తలు వినడం జరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఇలా ఉన్నాయి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రాశివారికి గురు, శుక్ర, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శించు కుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
క్రమంగా గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి. వారం మధ్యలో శుభ వార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకున్న సమయానికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కానీ, వాటిని సత్వరం పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పట్టడం ప్రారంభిస్తాయి. శనీశ్వరుడి దశమ స్థితి కార ణంగా ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందివస్తాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయ మార్గాలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశమున్నప్పటికీ, వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి కాస్తంత విముక్తి లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
లాభ స్థానంలో గురు, రవులు గరిష్ఠ స్థాయిలో శుభ ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. గృహ, వాహన సౌకర్యా లకు రుణ సౌకర్యం లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యమైన వ్యవహా రాలను సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, దశమ స్థానంలో ఉచ్ఛ రవి ఈ రాశివారికి ఈ వారమంతా కొండంత అండగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా మారతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగుల హోదా పెరుగుతుంది. ఇంట్లో కొత్త కార్యక్రమాలు చేపడతారు. మంచి పరిచయాలు ఏర్ప డతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో తప్ప కుండా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
భాగ్య స్థానంలో ఉన్న గురువు, రాశ్యధిపతి రవి కారణంగా వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపా రాలు నష్టాల నుంచి బయటపడతాయి. చిన్నా చితకా సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు నిర్వర్తిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం విషయంలో వీలైనంత శ్రద్ధ తీసు కోవడం శ్రేయస్కరం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. కొందరు మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సప్తమ స్థానంలో ఉన్న శుక్ర, బుధుల కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలావరకు బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో సమ స్యలు తీరిపోయి, ఊరట చెందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశికి సప్తమంలో గురువు, ఉచ్ఛ రవి సంచారం, రాశ్యధిపతి శుక్రుడి ఉచ్ఛ స్థితి కారణంగా ఈ రాశివారికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారులు ఆధారపడడం ఎక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయ త్నాలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశముంది. ఆదాయం పెరగడానికి చేసే ప్రయ త్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
పంచమ స్థానంలో ఉన్న బుధ, శుక్రులు, ఆరవ స్థానంలో ఉచ్ఛ రవి సంచారం కారణంగా ఏయ ప్రయత్నమైనా ఫలించే అవకాశముంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టడం వల్ల ఫలితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. ఆదాయానికి లోటు లేనప్పటికీ ఆర్థికంగా మాత్రం బాగా ఒత్తిడి ఉంటుంది. అనవసర ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇది వరకు ప్రయత్నం చేసిన పెళ్లి సంబంధం ఇప్పుడు కుదిరే అవకాశముంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
పంచమ స్థానంలో ఉన్న గురు, రవులు, చతుర్థ స్థానంలో శుక్ర, బుధుల కారణంగా వారమంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. కొన్ని ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సహాయ సహ కారాలు లభిస్తాయి. కుటుంబపరంగా కొన్ని ముఖ్యమైన బాధ్యతలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులకు తగ్గ ఆదాయం ఉంటుంది. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2)
ఈ వారమంతా శని, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీది బండిలా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. లాభార్జన మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. గృహ, వాహనాల కొనుగోలకు అవరోధాలు తొలగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబ బాధ్యతల కారణంగా ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఇష్టమైన బంధు వులు ఇంటికి వచ్చే అవకాశముంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ధన స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, తృతీయ స్థానంలో ఉచ్ఛ రవి సంచారం వల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సర్వత్రా మాట చెలామణీ అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగత సమస్యల కారణంగా ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలుంటాయి. బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. వ్యాపారాల్లో లాభాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యో గుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందో ళన కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
బుధ, శుక్ర, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా ఆదరణ పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశముంది. వ్యాపారాల్లో కొత్త ప్రక్రియలు, పద్ధతులు అమలు చేసి, లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభించే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. సొంత పనులు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.