Venus Transit in Libra
శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేస్తున్నప్పుడు శృంగార భావనలను పెంపొందిస్తాడు. సాధారణంగా ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లు వగైరాలకు ఇది అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఒక్కొక్కసారి అనవసర స్నేహాలు, అవాంఛనీయ స్నేహాలు, అక్రమ స్నేహాలకు కూడా అవకాశం ఉంటుంది. విలాసాలు, వ్యసనాలలో కూడా మునిగి తేలడం జరుగుతుంది. ఈ శుక్ర గ్రహం దుస్థానాల్లో ఉన్నవారికి సాధారణంగా ఇటువంటి అనవసర పరిచయాలు ఏర్పడడం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలోలత్వం పెరుగుతుంది. ఆ విధంగా చూస్తే ప్రస్తుతం వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు ఈ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత జాతకం కూడా ఇందుకు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ ఫలితాలకు మరింత బలం చేకూరుతుంది.
- వృషభం: ఈ రాశివారికి శుక్రుడు రాశినాథుడే అయినప్పటికీ, ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల సాధారణంగా శృంగార భావనలు మోతాదుకు మించి ఉంటాయి. స్త్రీలోలత్వం బాగా పెరుగుతుంది. విలాస జీవితం, వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. స్త్రీలతో పరిచయాలు పెరుగు తాయి. ఇటువంటి పరిచయాలతో సమస్యలేమీ ఉండకపోవచ్చు కానీ, ఆర్థిక సమస్యలు, ఆర్థిక పరమైన ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. పరిచయాల కంటే వ్యసనాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉండవచ్చు.
- సింహం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల అనవసర పరిచయాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ పరిచయాలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కూడా ఉంది. మిత్రుల కారణంగా తప్పుదోవ పట్టడం, మిత్రుల వల్ల మోసపోవడం వంటివి జరిగే సూచనలు న్నాయి. స్త్రీ సంబంధమైన పరిచయాల కారణంగా ప్రయాణాలు, విహార యాత్రలు పెరగడం జరుగుతుంది. వ్యసనాలకు, విలాస జీవితానికి అలవాటు పడడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు.
- కన్య: ఈ రాశివారికి ధన స్థానంలో శుక్ర సంచారం ఆర్థిక వ్యవహారాలకు బాగా అనుకూలంగానే ఉంటుంది కానీ, స్త్రీ సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగాన్ని ఇటువంటి అవాంఛనీయ పరిచయాలు మీద ఖర్చు చేయడం, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. విహార యాత్రల మీద ఖర్చులు పెరుగుతాయి. విలాస జీవితం అలవాటవుతుంది. స్వల్పకాలిక సంబంధాలు ఏర్పడే సూచనలు బాగా కనిపిస్తున్నాయి.
- వృశ్చికం: ఈ రాశివారికి వ్యయ (శయన) స్థానంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలోలత్వం బాగా పెరిగే అవకాశం ఉంది. విలాసాలు, వ్యసనాలు, స్త్రీలతో సంబంధాలు బాగా విజృంభించే సూచనలున్నాయి. ఖర్చులు పెరగడం, రుణాలు చేయడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వంటివి చోటు చేసు కునే అవకాశం ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అవకాశమిచ్చినా విశృంఖల జీవితం అలవాటయ్యే ప్రమాదం ఉంది. ప్రయాణాల మీదా, విహారాల మీదా ఖర్చు పెరిగే అవకాశం బాగా ఉంది.
- మకరం: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలకు సంబంధించిన జీవితం బాగా శుభప్రదంగా ఉన్నప్పటికీ, స్త్రీలోలత్వం కొద్దిగా శ్రుతిమించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎక్కువగా స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీ మూలక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. అంతేకాక, వృత్తి, ఉద్యోగాల్లోనే ఇటువంటి అనవసర పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇటువంటి పరిచయాలు కారణంగా ప్రయాణాలు, విహారాలు బాగా పెరుగుతాయి.
- మీనం: ఈ రాశివారికి ఎనిమిదవ స్థానంలో శుక్ర సంచారం వల్ల తగ్గు స్థాయిలోనే అయినప్పటికీ తప్పకుండా స్త్రీ పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాల మీద ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం, విలువైన కానుకలు సమర్పించడం వంటివి ఎక్కువగా జరుగుతాయి. ఇతర వ్యసనాలకు, విలాసాలకు అవకాశం లేదు కానీ, ఈ పరిచయాల కారణంగా కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు కూడా ఉన్నాయి. విహార యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది.
(జ్యోతిష్య శాస్త్రం వారివారి నమ్మకాల మీదే ఆధారపడి ఉంటుంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగరు)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..