మంగళవారం హనుమంతుడికి , మంగళదేవుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండడం, హనుమంతుడిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు మంగళవారం రోజున ఉపవాసం ఉండటం వల్ల జాతకంలో కుజుడు కూడా బలపడతాడు. మంగళవారం పూజను చేసే సమయంలో కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున తెలిసి లేదా తెలియక చేసి తప్పులతో హనుమంతుడికి మీపై కోపం రావచ్చు. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున పూజ ఎలా చేయాలి? ఏ పనులు చేయకూడదు ఈ రోజు తెల్సుకుందాం..
మంగళవారం చేయకూడని పనులు
ఉప్పు – మంగళవారం ఉప్పు తినకూడదు. మంగళవారం ఉప్పు తినడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఈ దిశలో ప్రయాణించడం నిషిద్ధం– మంగళవారం పడమర, ఉత్తర దిశలో ప్రయాణించడం నిషేధించబడింది. తప్పని సరి పరిస్థితుల్లో ఈ దిశలలో ప్రయాణించవలసి వస్తే, బెల్లం తిన్న తర్వాత ఇంటి నుండి బయలుదేరాల్సి ఉంటుంది.
వీటిని తినకూడదు– మంగళవారం మాంసం, చేపలు, గుడ్లు తినకూడదు. ఇలాంటి ఆహారం తినడం వలన జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి.
అప్పు ఇవ్వడం మానుకోండి– మంగళవారం రుణం ఇవ్వరాదు. ఈ రోజున అప్పు ఇస్తే.. ఆ డబ్బులు తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువ. ఈ రోజున మీరు ఎవరి వద్దనైనా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వవచ్చు.
కోపాన్ని అదుపులో ఉంచుకోండి – మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఈ రోజున ఎవరితోనూ గొడవ పడవద్దు అంతేకాదు చెడ్డ మాటలు మాట్లాడవద్దు
ఇనుప వస్తువులు కొనకండి– ఈ రోజున ఇనుప వస్తువులు కొనడం కూడా అశుభం. ఈ రోజున స్టీలు పాత్రలు, నెయిల్ కట్టర్, కత్తి, కత్తెర వంటి పదునైన వస్తువులు కొనరాదు. ఈ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయడం కూడా అశుభం.
మంగళవారం హనుమంతుడిని ఇలా పూజించండి
మంగళవారం ఉపవాస దీక్ష చేపట్టినట్లు అయితే.. కనీసం 21 మంగళవారాలు తప్పనిసరిగా ఉపవాసం దీక్షను కొనసాగించాలి. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజ గదిని శుభ్రపరచి.. హనుమంతుడి విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నెయ్యి నూనెతో దీపం వెలిగించాలి. హనుమంతుడికి పూలతో దండ వేసి.. మల్లె నూనె ఉంచండి. ఆ తర్వాత పూజానంతరం హనుమాన్ చాలీసా పఠించండి. అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).