Money Astrology: అంచనాలను మించి ఆ మూడు రాశుల వారి ఆర్థిక పరిస్థితి.. గ్రహగతుల మేరకు మీకు ఇలా..!
ఈ ఏడాది నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. ఇందులో శని గత జనవరి 18న మకర రాశి నుంచి కుంభ రాశిలోకి మారాడు. గురు గ్రహం ఈ నెల 23న మీన రాశి నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు..
ఈ ఏడాది నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. ఇందులో శని గత జనవరి 18న మకర రాశి నుంచి కుంభ రాశిలోకి మారాడు. గురు గ్రహం ఈ నెల 23న మీన రాశి నుంచి మేషరాశిలోకి మారుతున్నాడు. అక్టోబర్ 23న రాహు కేతువులు మీన కన్యారాశుల్లోకి మారుతున్నాయి. వివిధ రాశులపై ఈ మార్పుల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ మార్పుల ప్రభావం వల్ల ఏ రాశుల వారు ఏం సాధించ బోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ పరిశీలిద్దాం.
- మేషం, సింహం, ధనుస్సు: ఈ మూడు రాశుల వారు అగ్నితత్వానికి చెందినవారు. వీరికి ఆశలు, ఆశయాలు కాస్తంత ఎక్కువ. వీరు తమ ఆశలను నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని, ఎటువంటి సాహసానికైనా ఒడిగడతారని, ప్రతిదీ పోరాడి సాధించుకుంటా రని పేరు ఉంది. వీరు ఎక్కువగా అధికారం కోసం పాటుపడతారు. బాధ్యతల కంటే హక్కులు వీరికి ముఖ్యం. ఏదో విధంగా అధికారాన్ని చేజిక్కించు కోవడమే వీరి లక్ష్యం. ఉద్యోగంలో చేరి చేరగానే వీరి దృష్టి అధికారం మీద పడుతుంది. ఒక పట్టాన బయటపడరు కానీ మనసులో మాత్రం ఆ దిశగా కృషి జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది మే నెల తర్వాత నుంచి ఈ విషయంలో వీరికి అనుకూల కాలం ప్రారంభం అవుతుంది. గురు రాహు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీరు అధికారం చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది.
- వృషభం, కన్య, మకరం: ఇవి భూతత్వరాసులు. ఈ రాశుల వారికి అధికారం కంటే ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆర్థిక ప్రయోజనాలు లేనిదే దేనినీ కన్నెత్తి కూడా చూడరు. వీరికి మంచి జీతభత్యాలు ఇస్తే ఎంత సర్వీసు కైనా వెనుకాడరు. వీరు పట్టుదలకు మారుపేరు. అనుకున్న పని సాధించనిదే వదిలిపెట్టరు. సాధారణంగా ఈ రాశుల వారు ఆర్థిక రంగంలో అంటే బ్యాంకింగ్, ఎల్ఐసి, వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్, చిట్ ఫండ్స్ వంటి రంగాలలో ఎంతగానో రాణిస్తుంటారు. ఆదాయం సంపాదన లాభాలు ఆర్థిక లావాదేవీలు వంటి విషయాలలో వీరి ప్లానింగ్ చాలా గొప్పగా ఉంటుంది. వీరు ఆర్థిక పరంగా మంచి ఉద్యోగంలో చేరే సమయం మే నుంచి అక్టోబర్ వరకు అని చెప్పవచ్చు. ఆర్థిక విషయాలకు సంబంధించి వీరి మనసులోని కోరిక ఈ ఏడాది తప్పకుండా నెరవేరుతుంది. శని, గురు గ్రహాలు వీరికి ఈ ఏడాది బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి ఆర్థిక పరిస్థితి ఆశించిన దానికంటే ఎక్కువగా మెరుగుపడుతుంది.
- మిథునం, తుల, కుంభం: ఇవి ప్రధానంగా వాయుతత్వ రాశులు. ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ తమకు గౌరవ మర్యాదలు లభిస్తున్నంత కాలం తమ రంగాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఈ రాశుల వారు ఉద్యోగా లలో కంటే ఎక్కువగా వ్యాపారంలోనూ, విద్యా రంగంలోనూ పరిశోధనలలోను రాణిస్తుంటారు. వీరికి గౌరవ మర్యాదలు ముఖ్యం. తమ మాట చెల్లుబాటు కావడం ప్రధానం. తమ ప్రతిభను అధికారులు లేదా యాజమాన్యాలు గుర్తించి గౌరవిస్తే వీరు ఇక అధికారం గురించి వేతనం గురించి ఆలోచించరు. తమ జోలికి ఇతరులు రానంత కాలం వీరు ఎవరి జోలికి వెళ్ళరు. ప్రశంసలకు పొంగిపోవడం వీరి నైజం. అధికారులు వీరిని పొగడ్తలలో ముంచెత్తి పనిచేయించుకుంటూ ఉంటారు. సాధారణంగా జూలై తరువాత నవంబర్ లోపు వీరి మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది.
- కర్కాటకం, వృశ్చికం, మీనం: ఈ మూడు జలతత్వ రాశులు. ఈ రాశుల వారు సాధారణంగా విద్యాబోధన, ప్రభుత్వ రంగం, రాజకీయాలు, ఎక్సైజ్, ఇనుము, లోహాలు, వైద్యం, సామాజిక సేవ, వ్యవసాయం వంటి రంగాలలో రాణిస్తుం టారు. వీరికి కూడా అధికారం మీద, అజమాయిషి చేయడం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారిలో నిర్వహణ సామర్థ్యం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎటువంటి విపత్కర పరిస్థితిని అయినా అదుపు చేయగల సత్తా ఉంటుంది. సాధారణంగా రాజకీయాలలో తెరవెనుక కార్య కలాపాలు సాగించడంలో వీరిని మించినవారు ఉండరు. వీరిలో సహజసిద్ధంగా తార్కిక జ్ఞానం ఉంటుంది. ఎటువంటి చిక్కుముడినైనా క్షణంలో పరిష్కరించగల సామర్థ్యం వీరిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే, తమ ఆశయాల కోసం చివరి క్షణం వరకు పోరాడటం వీరికి సాధ్యం కాని పని. చివరి క్షణంలో దేవుడిపై భారం వేసి విరమించుకోవడం ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద వీరి మనసులోని కోరికలు మే నెల తరువాత నవంబర్ నెలలోపు నెరవేరే సూచనలు ఉన్నాయి. వీరు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే వీరికి అంత మంచి జరుగుతుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..