వారికి జీతం కంటే అదనపు ఆదాయంపైనే ధ్యాస ఎక్కువ.. ఈ విషయంలో ఏయే రాశివారి నైజం ఎలా అంటే..?

| Edited By: Janardhan Veluru

Aug 12, 2023 | 6:00 PM

ప్రస్తుతం ప్రతి శుభ గ్రహం పాపగ్రహంతో కలిసి ఉండడం, శని, శుక్ర గ్రహాలు వక్రించి ఉండడం వంటి కారణాల వల్ల అదనపు ఆదాయం మీద అందరి దృష్టీ పడుతుంది. మేషంలో గురు రాహువులు, కర్కాటకంలో రవి, శుక్రులు, సింహంలో బుధ, కుజులు కలిసి ఉండడం వల్ల ప్రతివారిలోనూ డబ్బాశ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన గ్రహాల స్థితిగతులు అదనపు ఆదాయ ప్రయత్నాలకు సంబంధించి ఏయే రాశుల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో..

వారికి జీతం కంటే అదనపు ఆదాయంపైనే ధ్యాస ఎక్కువ.. ఈ విషయంలో ఏయే రాశివారి నైజం ఎలా అంటే..?
Extra Income
Follow us on

జీతభత్యాలు కాకుండా అదనపు ఆదాయాన్ని కోరుకోని ఉద్యోగి ఉండడు. ఓవర్ టైమ్ కాకుండా ఎక్కడైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం, వడ్డీలకు డబ్బు ఇవ్వడం, అవినీతికి పాల్పడడం, ఫిక్సెడ్ డిపాజిట్ల మీద వడ్డీ రావడం వంటివి అదనపు ఆదాయానికి ఉన్న ముఖ్యమైన అవ కాశాలు. అయితే, ప్రస్తుతం ప్రతి శుభ గ్రహం పాపగ్రహంతో కలిసి ఉండడం, శని, శుక్ర గ్రహాలు వక్రించి ఉండడం వంటి కారణాల వల్ల అదనపు ఆదాయం మీద అందరి దృష్టీ పడుతుంది. మేషంలో గురు రాహువులు, కర్కాటకంలో రవి, శుక్రులు, సింహంలో బుధ, కుజులు కలిసి ఉండడం వల్ల ప్రతివారిలోనూ డబ్బాశ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన గ్రహాల స్థితిగతులు అదనపు ఆదాయ ప్రయత్నాలకు సంబంధించి ఏయే రాశుల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో ఇక్కడ స్థూలంగా పరిశీలిద్దాం. సాధారణంగా ఇటువంటి అంశాలు వ్యక్తిగత జాతక చక్రం మీద 75 శాతం వరకూ ఆధారపడి ఉంటాయని గమనించాలి. ఎంత ప్రయత్నించినా ఏ మేరకు అదనపు ఆదాయాన్ని కూడగట్టుకుంటారన్నది కూడా ఎక్కువగా వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది.

మేషం: ఈ రాశివారికి ఈ గ్రహగతుల కారణంగా డబ్బాశ బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సంబంధమైన అవసరాలు పెరగడం కూడా అందుకు ముఖ్యమైన కారణం. ఈ రాశిలో గురు, రాహువులు కలవడం వల్ల ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే తాపత్రయం ఎక్కువవుతుంది. ఈ రాశిలో ఉన్న అశ్విని నక్షత్రంవారికి మినహాయిస్తే, భరణి, కృత్తిక నక్షత్రాల వారికి కోరికలు అదుపు తప్పుతాయి. పార్ట్ టైమ్ లేదా అక్రమార్జనకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంది.

వృషభం: ఈ రాశివారికి సాధారణంగా ధన సంపాదన మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ రాశివారు ఈ ఏడాది అవినీతి సంపాదనకు పాల్పడే అవకాశం లేదు కానీ, కష్టార్జితాన్ని వడ్డీలకు తిప్పడం, మరో సంస్థకు కూడా పనిచేయడం వంటివి జరుగుతాయి. బాగా కష్టపడి ఆర్థిక స్థిరత్వం సంపాదించుకుంటారు. ఈ రాశిలోని కృత్తిక, మృగశిర నక్షత్రాల వారికి అదనపు అవకాశాలు బాగా కలిసి వస్తాయి. తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు.

ఇవి కూడా చదవండి

మిథునం: ఈ రాశివారిలో ఈ ఏడాది కోరికలు పెరుగుతాయి. గృహ, వాహన, ఆధునిక సౌకర్యాల మీదకు దృష్టి మళ్లుతుంది. ఫలితంగా ఏదో విధంగా డబ్బు సంపాదించడానికి నడుంబిగిస్తారు. అది సక్ర మమైనా పరవాలేదు, అక్రమమైనా పరవాలేదు. లాభస్థానంలో అంటే సంపాదన స్థానంలో గురు రాహువులు కలిసి ఉండడం ఈ ధోరణికి ప్రధాన కారణం. ఇందులో మృగశిర, ఆర్ద్ర నక్షత్రాల వారు బాగా దూకుడుగా ప్రయత్నాలు సాగిస్తారు. ప్రభుత్వపరంగా అదనపు ఆర్జనకు అవకాశం ఉంది.

కర్కాటకం: ధన స్థానంలో కుజ, బుధులు కలిసి ఉండడం వల్ల ఆధునిక సౌకర్యాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం సాధించాలన్న తపన కూడా పెరుగుతుంది. ఫలితంగా అదనపు ఆదాయం కోసం పార్ట్ టైమ్ ఉద్యోగాలలో చేరడమో, ఎవరికైనా అదనంగా పనిచేసి పెట్టడమో జరుగుతుంది. అదనపు సంపాదనకు మాత్రం తప్పకుండా అవకాశం ఉంది. ఈ రాశిలోని పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వారు లక్ష్య సాధన కోసం ఎంత శ్రమ పడడానికైనా సిద్ధ పడడం జరుగుతుంది.

సింహం: ఈ రాశిలో కుజ, బుధులు సంచరిస్తుండడం, భాగ్యస్థానంలో గురు, రాహువులు కలిసి ఉండడం వల్ల అదనపు ఆదాయం మీద కోరిక పెరుగుతుంది. సాధారణంగా వడ్డీ వ్యాపారాలు చేయడం, బ్యాంకులకు ఏజెంట్ గా వ్యవహరించడంతో పాటు, కొద్దిగా అవినీతి కార్యకలాపాలకు కూడా సిద్ధ పడే అవకాశం ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం లేదా పెంచుకోవడం మీద మనసు పడతారు. మఖ, పుబ్బ నక్షత్రాల వారు ఇందుకు అహర్నిశలూ కష్టపడతారు.

కన్య: ఈ రాశివారిలో డబ్బాశ బాగా పెరుగుతుంది. ఈ రాశివారు డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తులకు చెందినవారైతే డబ్బు వసూలు చేయడమే ధ్యేయంగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఏ ఉద్యో గంలో ఉన్నవారైనప్పటికీ, అదనపు సంపాదన కోసం ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఒక్కోసారి విచక్షణకు కూడా అవకాశం ఉండదు. డబ్బు దాచుకోవడమే వీరి ప్రధాన లక్ష్యం అవుతుంది. ఉత్తర, చిత్త నక్షత్రాల వారికి డబ్బు మీద మరింతగా ఆరాటం పెరుగుతుంది.

తుల: ఈ రాశివారికి ఆధునిక సౌకర్యాలు, విలాసాలు, పర్యటనలు మీద బాగా వ్యామోహం పెరుగుతుంది. విపరీతంగా డబ్బు సంపాదించమే లక్ష్యంగా మారుతుంది. ఉద్యోగపరంగా కంటే వృత్తి, వ్యాపారాలపరంగా అత్యధికంగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. వడ్డీ వ్యాపారాల ద్వారా డబ్బు వసూలు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఏదో విధంగా ఆదాయం పెంచుకుం టారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకుంటారు. స్వాతి నక్షత్రం వారికి అడ్డూ అదుపూ ఉండదు.

వృశ్చికం: ఈ రాశివారికి డబ్బాశ ఈ ఏడాది ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఎక్కువగా ఇతర సంస్థలకు కూడా పనిచేయడం వల్ల, ప్రస్తుతం చేస్తున్న సంస్థలోనే ఓవర్ టైమ్ పనిచేయడం వల్ల అదనపు ఆదాయానికి అవకాశం ఉంటుంది. అవినీతి కార్యకలాపాలకు అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడమే ప్రధానం అయిపోతుంది. అతి కొద్దిగా మాత్రమే ఆదాయం పెరుగుతుంది. ఇందులోనూ అనూరాధ నక్షత్రం వారికి మాత్రం సమయం అనుకూలంగా ఉంది.

ధనుస్సు: ఈ రాశివారికి డబ్బుకు సంబంధించిన యాంబిషన్, ఆశలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు సంపాదన మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది. సాధారణంగా అవినీతికి, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు కానీ, అదనపు సంపాదన కోసం ఇంటా బయటా కూడా శ్రమ పడే అవకాశం ఉంటుంది. తమలోని ప్రతి నైపుణ్యాన్ని వీరు సంపాదనకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇందులోనూ పూర్వాషాఢ నక్షత్రం వారు అవిశ్రాంతంగా డబ్బు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

మకరం: వీరి దృష్టంతా ఆర్థిక స్థిరత్వం మీదే కేంద్రీకృతమై ఉంటుంది. సొంతానికి కాక, ఇతరుల కోసం ఎక్కువగా కష్టపడడం, సంపాదించడం జరుగుతుంటుంది. సాధారణంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ఓవర్ టైమ్, ఇతర సంస్థలకు సేవలందించడం వంటి మార్గాల ద్వారానే వీరు అదనపు ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది వీరికి తప్పకుండా అదనపు అవకాశాలు కలిసి వచ్చి, ఆదాయం పెరగడం జరుగుతుంది. ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంది.

కుంభం: ‍సాధారణంగా జీతభత్యాలతో తృప్తి పడే ఈ రాశివారికి ఈ ఏడాది అదనపు ఆదాయం మీద దృష్టిపడే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం వీరు అధిక శ్రమకు లోనవుతారు. సాధారణంగా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం మీద వీరి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కుటుంబం కారణం గానే డబ్బాశ పెరుగుతుంది. ఓవర్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాల మీదే వీరి దృష్టి ఉంటుంది. వీరు అవినీతికి పాల్పడే అవకాశాలు చాలా తక్కువ. శతభిషం నక్షత్రం వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది.

మీనం: ఈ రాశివారికి సంసార తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఆస్తినివ్వాలనే ఏకైక లక్ష్యంతో వీరు అదనపు సంపాదనకు ప్రయత్నిస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగాలలో జీతభత్యాలు బాగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, వీరు తమ విరామ సమయాన్ని ఎక్కువగా అదనపు సంపాదనకు వినియోగి స్తుంటారు. దైవ కార్యా లకు కూడా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ ఏడాది ఈ రాశివారి లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి