Money Astrology
జ్యోతిష శాస్త్రంలో 3, 6, 10, 11 స్థానాలను ఉపచయ స్థానాలు అంటారు. ఉపచయ స్థానా లంటే ధన వృద్ధి స్థానాలని అర్థం. ఈ స్థానాలలో రవి సంచారం జరిగితే ఆదాయ పరంగా లేదా సంపాదనపరంగా లేదా లాభాలపరంగా ఎంతో అభివృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారా లలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రవి గ్రహం వృషభ రాశిలో సంచారం చేస్తోంది. ఇది జూన్ 16 వరకు అదే రాశిలో కొనసాగుతుంది. జూన్ 16 వరకు కర్కాటకం, సింహం, ధనస్సు, మీన రాశుల వారికి ఆర్థిక పరంగా అభివృద్ధి కలిగిస్తోంది. ఏదో విధంగా ఈ రాశుల వారు కాస్తో కూస్తో అదనపు ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి అతి ముఖ్యమైన ఉపచయ స్థానమైన 11వ స్థానంలో రవి ప్రవేశం జరగటం ఆదాయపరంగా ఆశించిన స్థాయిలో వృద్ధిని సూచిస్తోంది. బ్యాంక్ బ్యాలెన్స్ తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా 11వ స్థానంలో రవి సంచారం జాతకంలో ఎన్ని దోషాలనైనా పోగొడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈనెల ఈ రాశి వారికి అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి వీరు తీసుకునే నిర్ణయాలు చేసే ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. కొద్దిపాటి ప్రయత్నంతో వీరి సంపాదన పెరగటం ఖాయం అని చెప్పవచ్చు.
- సింహ రాశి: ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి సంచరిం చడం తప్పకుండా ఆర్థిక సంబంధమైన అదృష్టం కలగజేస్తుంది. రవి గ్రహం ఈ రాశికి అధిపతి కూడా అయినందువల్ల వీరి ప్రయత్నాలన్నీ తప్పకుండా సఫలం అయ్యి, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి అవకాశం కలుగుతుంది. ఉద్యోగ పరంగా భారీ మొత్తంలో ఇంక్రిమెంట్ లభించడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో అనాయాసంగా అప్రయత్నంగా లాభాలు ఆర్జించే సూచనలు ఉన్నాయి. పాజిటివ్ గా వ్యవహరించి ఎంత ప్రయత్నం చేస్తే అంతగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.
- ధను రాశి: ఈ రాశి వారికి ఆరవ స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇక రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. అదనపు ఆదాయానికి సంబంధించి ఏ చిన్న ప్రయత్నం మొదలుపెట్టినా అది వెంటనే సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
- మీన రాశి: ఈ రాశి వారికి మూడవ స్థానంలో రవి సంచారం వల్ల ధన వృద్ధి యోగం పట్టింది. అతి చిన్న ప్రయత్నంతో భారీగా సంపాదన కూడగట్టుకోవడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి తప్పకుండా అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ నెల రోజుల కాలంలో ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది విజయవంతం అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రాశి అధిపతి అయిన గురు గ్రహం ధన స్థానంలోనే ఉన్నందువల్ల రవి గ్రహం మరింత చురుకుగా, వేగంగా ఈ రాశి వారి కోరికలను నెరవేరుస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరగటమే కాకుండా అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..