September 2023 Monthly Horoscope
Monthly Horoscope (September 2023): భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబరు మాసంలో గ్రహ సంచార రీత్యా 12 రాశుల వారికి మాసఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి దాదాపు ఆగస్టు నెల పరిస్థితే కొనసాగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17న ఆరవ స్థానంలోకి మారు తున్న రవి గ్రహం కారణంగా శత్రు, రోగ,రుణ బాధలు ఏవైనా ఉంటే అవి తప్ప కుండా తగ్గు ముఖం పడతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు యథా ప్రకారం లాభదాయకంగా కొనసాగుతాయి. రాశిలో ఉన్న గురువు, నాలుగైదు స్థానాలలో ఉన్న శుక్ర, బుధులు ఈ రాశివారికి కచ్చితంగా అభివృద్ధి పథంలో పెడతాయని చెప్పవచ్చు. ఇక 11వ స్థానంలో ఉన్న శనీశ్వరుడు ఆదాయాన్ని పెంచడమే కాక, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాడు. రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుతాడు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు. రాశిలో ఉన్న రాహువు కారణంగా స్నేహితులు లేదా నమ్మినవారు మోసం చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశివారికి ఈ నెల వృత్తి, ఉద్యోగాల పరంగా హోదా పెరగడంతో పాటు, సామాజికంగా పేరు ప్రతిష్ఠలు పెంచే అవకాశం ఉంది. శుక్ర, బుధ, రవి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల తప్ప కుండా శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. సంసార జీవితం సుఖమయంగా సాగిపో తుంది. మీ సలహాలు, సూచనలు, ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. లాభాల పరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అనుకకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సొంత ఆలోచనలతో, స్వయం నిర్ణయాలతో అనేక విధాలుగా పురోగతి చెందుతారు. జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. దశమంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యయ స్థానంలో ఉన్న గురు, రాహువుల కారణంగా డబ్బు నీళ్లలా ఖర్చు కావడం జరుగుతుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): భాగ్య స్థానంలో భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు, లాభ స్థానంలో గురు, రాహువుల వల్ల ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశాలకు సంబంధించిన సంస్థల్లోకి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. రాశినాథుడైన బుధుడు తృతీయంలో, శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు సునాయాసంగా పరిష్కారం అవుతాయి.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ నెల చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆశించిన విధంగా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. దశమ స్థానంలో ఉన్న గురువు వల్ల వృత్తి, ఉద్యోగాలలో జీత భత్యాలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. అదే స్థానంలో సంచరిస్తున్న రాహువు కారణంగా సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కునే సూచనలున్నాయి. అష్టమ శని కారణంగా వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరగడం జరుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. తిప్పట తప్పకపోవచ్చు. ఈ రాశిలో సంచరిస్తున్న శుక్రుడి వల్ల అనవసర ఖర్చులకు, విలాసాలపై ఖర్చులకు అవకాశం ఉంది. రవి, బుధ, కుజుల అనుకూలతల వల్ల ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతే తప్ప తిరోగతి ఉండదు. ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అవసరాలు తీరుతూ ఉంటాయి. ఆరోగ్యానికి లోటుండదు. భాగ్య స్థానంలో ఉన్న గురువు వల్ల ఎటు వంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. విదేశీ ఉద్యోగాలకు లేదా చదువులకు అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. సప్తమంలో ఉన్న శనీశ్వరుడి వల్ల రాజకీయంగా పలుకుబడి పెరిగే సూచనలు న్నాయి. అయితే, ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఈ రాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. తండ్రితో కొద్దిగా విభేదాలు తలెత్తవచ్చు. మాట తొందరపాటు వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశివారికి ఈ నెల చాలావరకు సంతృప్తికరంగా గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం కావడంతో పాటు, మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. దూకుడుగా వ్యవహరిం చడం, సాహసాలకు తెగబడడం వంటివి తగ్గించుకోవడం మంచిది. అధికారులతో కానీ, తండ్రితో కానీ ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలోనూ, ప్రయాణాలలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరవ స్థానంలో సంచరిస్తున్న శనీశ్వరుడి కారణంగా ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. అష్టమ స్థానంలో గురు, రాహువుల సంచారం వల్ల జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఈ రాశిలో సంచరిస్తున్న కుజ గ్రహం వల్ల ప్రయాణాలలో, సొంత డ్రైవింగ్ లో ప్రమాదాలు ఎదురు రావచ్చు. లాభస్థానంలో శుక్రుడి వల్ల ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి లేదా ప్రయోషన్ కు వీలుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఒక్క కుజుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఆశించిన పనులు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ నెలంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒడి దుడుకులు ఎదురు కావచ్చు. రవి, శనుల పరస్పర వీక్షణ వల్ల అధికారులతో తలపడే పరిస్థితులు ఎదురవుతాయి. తండ్రితో కూడా వైరం ఏర్పడవచ్చు. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. రాశినాథుడు లాభస్థానంలో సంచరిస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, ప్రయత్నాలు సానుకూలపడడం, పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులకు అండగా నిలబడతారు.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ నెలంతా ప్రశాంతంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది. సహాయ కార్యక్రమాల్లో, దైవ కార్యాల్లో పాల్గొంటారు. తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆదాయ వృద్ధి, ఆశించిన పురోగతి తప్పకుండా ఉంటాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. పంచమ స్థానంలో ఉన్న గురువు వల్ల మీ ఆలోచనలకు, సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. వీటివల్ల అధికారులు లబ్ధి పొందుతారు. భాగ్య స్థానంలో బుధుడు, రవి, దశమ స్థానంలో కుజుడి కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనుకూలతలు కనిపించడంతో పాటు, శుభవార్తలు కూడా వింటారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ నెలంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారంతో పాటు, మనసులోని కొన్ని కోరికలు అప్రయత్నంగా నెరవేరడం కూడా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. ధన స్థానంలో ఉన్న రాశినాధుడి వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం కూడా జరుగుతుంది. చతుర్థ స్థానంలో ఉన్న గురు, రాహువుల వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాలపరంగా బరువు బాధ్యతలు పెరగడం, ఒత్తిడి ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల మానసిక ప్రశాంతతకు లోటుండదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బుధ, రవులు ఏమంత అనుకూలంగా లేనందువల్ల ముఖ్యమైన పనులు ఒక పట్టాన పూర్తికావు.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశివారికి ఈ నెలంతా మిశ్రమంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఏ మాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. విశ్రాంతి కరువవుతుంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. రాశిలో ఉన్న శనీశ్వరుడి కారణంగా శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. తృతీయ స్థానంలో ఉన్న గురు, రాహువుల కారణంగా ఆదాయ వృద్ధి ఉంటుంది కానీ, అందుకు తగ్గట్టుగా వృథా ఖర్చులు కూడా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. సప్తమంలో ఏర్పడిన బుధాదిత్య యోగం కారణంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి సంబంధించి ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశివారికి ఈ నెలంతా అనుకూలంగా గడిచిపోతుంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే కాక, వృత్తి, ఉద్యోగాల పరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. మానసిక ప్రశాం తత లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. రాశినాథుడైన గురువు ధన స్థానంలో ఉన్నందువల్ల ఆర్థికపరంగా, కుటుంబపరంగా పురోగతి ఉంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆచితూచి వ్యవహరించడం అన్నివిధాలా మంచిది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.