వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు 2026: ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్త..!

Vruschikam Rashi 2026 Predictions: వృశ్చిక రాశి వారు 2026 ప్రథమార్థంలో ఆరోగ్యం, ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్త అవసరం. కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు ఇబ్బంది పెట్టవచ్చు. జూన్ తర్వాత జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు, ప్రేమ, వివాహాల్లో శుభం కలుగుతాయి. కోరికలు నెరవేరి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణాలు, పిల్లల అభివృద్ధి ఆనందాన్నిస్తాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది.

వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు 2026: ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్త..!
Scorpio Horoscope 2026

Edited By:

Updated on: Dec 28, 2025 | 8:40 PM

Scorpio Horoscope 2026: కొత్త సంవత్సరం ప్రథమార్థంలో వృశ్చికం రాశివారు ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం కూడా చాలా ఉత్తమం. ద్వితీయార్థంలో వీరికి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. చతుర్థ స్థానంలో రాహువు సంచారం వల్ల వీరికి కొద్దిగా కుటుంబ సంబంధమైన టెన్షన్లు ఉండే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. గృహ, వాహన ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. జూన్ నుంచి మాత్రం జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరడంతో పాటు, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నమైనా నెరవేరుతుంది.

ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు

కొత్త సంవత్సరం ప్రథమార్థంలో ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. మధ్య మధ్య అధికారులతో తలపడే పరిస్థితులు ఎదురవుతాయి. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. మొదటి ఆరు నెలలు ఒక పరీక్షా సమయంగా కనిపిస్తుంది. జూన్ తర్వాత నుంచి నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి.

ప్రేమలు, పెళ్లిళ్లు, పిల్లలు

కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహా రాలకు ఈ రాశివారు ఈ ఏడాదంతా దూరంగా ఉండడం మంచిది. వీరికి సంప్రదాయబద్ధమైన వివాహమే శ్రేష్టం. ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జూలై తర్వాత వీరికి పెళ్ళి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇంత వరకూ సంతానం లేనివారికి మే తర్వాత సంతాన ప్రాప్తికి సంబంధించిన శుభవార్త అందుతుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా జూన్ తర్వాత తప్పకుండా తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు బాగా వృద్దిలోకి వస్తారు.

అనుకూల పరిస్థితులు

ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. అర్ధాష్టమ రాహువు కారణంగా కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తల్లి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడడం, ప్రయత్నాలు సానుకూలపడడం, పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి. ప్రముఖు లతో పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులకు అండగా నిలబడతారు. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. తీర్థయాత్రలు, విహార యాత్రలతో పాటు విదేశీయానానికి కూడా అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

అనుకూల నెలలు

ఈ రాశివారికి ఫిబ్రవరి, మే, జూలై, సెప్టెంబర్, నవంబర్ నెలలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఈ నెలల్లో శుభకార్యాలు జరగడం, శుభవార్తలు వినడంతో పాటు, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ఈ నెలల్లో వ్యక్తిగత పురోగతికి, ఉద్యోగాల్లో పదోన్నతికి, విదేశీయానానికి కూడా అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆదాయం బాగా పెరగడం వల్ల బంధుమిత్రులకు శుభ కార్యాల్లో బాగా సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.