
Lucky Zodiac Signs
Telugu Astrology: ఈ నెల(మే) 18న రాహుకేతువులు రాశులు మారుతున్నాయి. వారం రోజుల తేడాతో గురువు కూడా రాశి మారుతున్నాడు. ఒక్కో రాశిలో ఏడాదిన్నర పాటు ఉండే రాహుకేతువులు, ఒక్కో రాశిలో ఏడాదిపాటు ఉండే గురువు వల్ల వివిధ రాశుల మీద తప్పకుండా వీటి ప్రభావం పడుతుంది. ఇందులో రాహుకేతువులు పరమ పాప గ్రహాలు కాగా, గురువు పరమ శుభ గ్రహం. ఈ మూడు గ్రహాల రాశి మార్పు వల్ల కొన్ని రాశుల మీద మిశ్రమ ప్రభావం పడే అవకాశం ఉండగా, కొన్ని రాశులకు మాత్రం మంచి అదృష్టాలను కలుగజేసే అవకాశం ఉంది. ఈ శుభ, పాప గ్రహాల రాశి మార్పు వల్ల మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, ధనూ రాశివారు అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి గురువుతో పాటు రాహుకేతువుల సంచారం కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏలిన్నాటి శని ప్రభావం ఉండకపోవచ్చు. లాభ, పంచమ స్థానాల్లోని రాహు కేతువుల వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరగడం, విదేశాల్లో ఉద్యోగం చేయడం, గృహ యోగం పట్టడం, అనారోగ్యాల నుంచి కోలుకోవడం, సంతాన ప్రాప్తి కలగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తృతీయంలో ఉన్న గురువు వల్ల ప్రతి దానికి కొద్దిపాటి ప్రయత్నం అవసరమవుతుంది.
- వృషభం: ఈ మూడు గ్రహాల సంచారం ఈ రాశివారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండబోతోంది. ధన స్థానంలోని గురువు వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అదృష్టాలు కలుగుతాయి. ఇల్లు, వాహనం అమరుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది.
- మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం, ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, ఆరోగ్యం మెరుగుపడడం, సంపద పెరగడం, మంచి పెళ్లి సంబంధం కుదరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. భాగ్య, తృతీయ స్థానాల్లోని రాహుకేతువుల వల్ల విదేశాల్లో ఉద్యోగాలు లభించడం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కలగడం వంటివి జరుగుతాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.
- కన్య: ఈ రాశిలో సంచారం చేసిన కేతువు వ్యయ స్థానంలోకి వెళ్లి పోవడం వల్ల అనారోగ్యాలు, కొన్ని సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం జరుగుతుంది. సప్తమంలో ఉన్న రాహువు ఆరవ రాశి లోకి మారడం వల్ల కుటుంబ, దాంపత్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరగడం, అనారోగ్యాల నుంచి బయటపడడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం జరుగుతాయి. దశమ స్థానంలోని గురువు వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి.
- తుల: ఈ రాశికి పంచమ, లాభ స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. భాగ్య స్థానంలో గురువు ప్రవేశం వల్ల ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడడంతో పాటు ఆస్తిపాస్తులు కలిసివస్తాయి.
- ధనుస్సు: ఈ రాశికి తృతీయ, భాగ్య స్థానాల్లో రాహుకేతువుల సంచారం వల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. సప్తమ స్థానంలో గురువు ప్రవేశం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. భాగస్వాములతో సమస్యలు పరిష్కారమవుతాయి.