పుష్య మాసం సంప్రదాయ తెలుగు క్యాలెండర్‌లో పదవ నెల. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసాన్ని పుష్య మాసం అని అంటారు. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. దీనిని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లలో అనుసరిస్తారు. పుష్య మాసం వివాహాలు, గృహ ప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల ఆచారాలకు అశుభకరమైన మాసంగా పరిగణించబడుతుంది, అయితే దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. పుష్య మాసం 2024లో ఈ రోజు ( జనవరి 12న) ప్రారంభమై 9 ఫిబ్రవరిన ముగుస్తుంది. శుక్ల పక్షం జనవరి 12న ప్రారంభమై జనవరి 25న ముగుస్తుంది. పుష్య మాసం 2024లో కృష్ణ పక్షం జనవరి 26న ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగుస్తుంది.
భోగి, సంక్రాంతి , పుష్య నవరాత్రి లేదా శాకంబరి నవరాత్రి, కనుమ, ముక్కనుమ, త్యాగరాజ ఆరాధన, శటిల ఏకాదశి తెలుగు క్యాలెండర్‌లో పుష్య మాసంలో ముఖ్యమైన పండుగలు. శీతాకాలంలో వచ్చే పుష్య మాసం.. ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించివారు దోష రహితులుగా మారతారని విశ్వాసం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా పండితులు చెబుతున్నారు.
శివునకు కార్తీక మాసం.. విష్ణువుకు మార్గశిర మాసం ఏ విధంగా ఇష్టమైన మాసాల్లో అదే విధంగా పుష్య మాసం శనీశ్వరుడికి ప్రీతికరం. ఎందుకంటే శనీశ్వరుడి జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెల రోజుల పాటు శనైశ్చరుణ్ని ఎవరు పూజిస్తారో వారి పట్ల శనీశ్వరుడు ప్రసన్న దృష్టిని కలిగి ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు