Telugu Astrology: మేష రాశిలో బుధుడు.. ఆ రాశుల వారికి సమస్యలు, ఒత్తిళ్లు! పరిహారాలు తెలుసుకోండి

మే 7 నుండి మే 23 వరకు బుధుడు మేష రాశిలో సంచరిస్తాడు. ఇది మేషం, వృషభం, కన్య సహా మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. గణపతి స్తోత్ర పారాయణం ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.

Telugu Astrology: మేష రాశిలో బుధుడు.. ఆ రాశుల వారికి సమస్యలు, ఒత్తిళ్లు! పరిహారాలు తెలుసుకోండి
Telugu Astrology

Edited By: Janardhan Veluru

Updated on: May 09, 2025 | 3:28 PM

మే 7న మేష రాశిలోకి ప్రవేశించిన బుధుడు మే 23 వరకూ ఇదే రాశిలో కొనసాగుతాడు. మేష రాశి బుధుడికి శత్రు స్థానం. ఈ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు బుధుడు మేషం, వృషభం, కన్య, తుల, వృశ్చికం, కుంభ రాశులకు సమస్యలను, ఒత్తిళ్లను సృష్టించడం తప్ప అదృష్టాలు కలగజేసే అవకాశం ఉండదు. ఈ అశుభ బుధుడి ప్రభావం నుంచి తప్పించుకోవాలన్న పక్షంలో ఈ రాశుల వారు గణపతి స్తోత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం చాలా మంచిది. ప్రతికూల ఫలితాలు చాలావరకు తగ్గిపోతాయి.

  1. మేషం: ఈ రాశికి అత్యంత పాప గ్రహమైన బుధుడు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల అడపాదడపా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శుభ వార్తలను ఆశించకపోవడం మంచిది. ముఖ్యమైన ప్రయత్నాల్లో అవరోధాలు, వ్యయ ప్రయాసలు ఉండే అవకాశం ఉంది. గృహ, ఆస్తి సంబంధమైన ఒప్పందాలపై సంతకాలు చేయకపోవడం మంచిది. తల్లి వైపు బంధువుల వల్ల ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల వల్ల బాగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయ మార్గాలు తగ్గే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన స్థాయి ఎదుగుదల ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడ తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.
  3. కన్య: రాశ్యధిపతి బుధుడు అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఏ పనీ, ఏ ప్రయత్నమూ సక్రమంగా పూర్తయ్యే అవకాశం ఉండదు. రావలసిన డబ్బు చేతికి అందదు. గతంలో మీ నుంచి సహాయం పొందిన కొందరు బంధుమిత్రులు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులు లేదా సహచరులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలు పెరుగుతాయి.
  4. తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడికి సప్తమ స్థాన సంచారం ఏమంత మంచిది కాదు. అనుకున్నదొకటి అయిందొక్కటి అన్న చందంగా ఉంటుంది. ఆదాయం పెరిగినా ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉండదు. కుటుంబ సభ్యులతో పేచీలు తలెత్తుతాయి. జీవిత భాగ స్వామికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభించకపోవచ్చు. ఆస్తి సంబంధమైన ఒప్పందాలకు ఇది సమయం కాకపోవచ్చు.
  5. వృశ్చికం: ఈ రాశికి ఆరవ స్థానంలో బుధ సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆస్తి వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాల వల్ల నష్టపోతారు. బాగా ఇష్టమైన బంధుమిత్రులు దూరమయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గుతాయి. అనారోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు.
  6. కుంభం: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ సంచారం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం బాగా తగ్గుతాయి. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. తోబుట్టువులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించకపోవచ్చు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. వృథా ఖర్చులు పెరుగుతాయి.