Lucky Horoscope 2024
గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ప్రస్తుతం ఆరు రాశులు అదృష్ట రాశులుగా చెలామణీ అవుతున్నాయి. ఈ రాశులకు గురు, శుక్రులు బాగా అనుకూలంగా మారినందువల్ల అనేక విధాలుగా ఈ రాశుల వారి ప్రాభవం, వైభవం పెరగడం జరుగుతుంది. ఇందులో మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశులున్నాయి. ఆదాయ వృద్ధి, అధికార యోగంతో పాటు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం, పెళ్లి సంబంధం కుదరడం, మంచి ఉద్యో గంలో ప్రవేశించడం వంటివి ఈ రాశుల వారికి వచ్చే రెండు నెలల కాలంలో జరిగే అవకాశాలు న్నాయి.
- మేషం: ఈ రాశివారికి కుటుంబ స్థానంలో గురు, శుక్రులు కలుస్తున్నందువల్ల తప్పకుండా ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. గృహ ప్రవేశ యోగం కూడా ఉంది. వృక్తిగత అభివృద్ధి, పురోగతికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
- వృషభం: ఈ రాశిలోకి ఈ రాశ్యధిపతి శుక్రుడు ప్రవేశించడం, ఇదే రాశిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల ఏ పని లేదా ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. స్వయంగా ప్రము ఖుడుగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ధన ధాన్య వృద్ధి ఉంటుంది. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. సంపన్న స్థితికి చేరుకుంటారు.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో రెండు శుభ గ్రహాలు చేరడం వల్ల అదృష్టం అనేది ఏ విధంగా చూసినా రెట్టింపవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విలాస జీవితం అలవడుతుంది.
- కన్య: భాగ్య స్థానంలో రెండు శుభ గ్రహాలు యుతి చెందడం ఒక అరుదైన యోగం. ఈ రాశివారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గిపోతాయి. విదేశీ అవకాశాలు అంది వస్తాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. సంతాన యోగ సూచనలున్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
- మకరం: ఈ రాశికి పంచమ కోణంలో రెండు శుభ గ్రహాలు చేరడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అయి, మనసులోని కోరికలు నెరవేరుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశముంది. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా కొనసాగు తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్ర, గురువుల యుతి జరుగుతున్నందువల్ల, గృహ, వాహన యోగాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తులు కొనే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరగడం, స్థిరత్వం లభించడం జరుగుతాయి. సామాజికంగా కూడా స్థితి గతులు మారిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం చాలావరకు తగ్గిపోతుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెడతారు.