Job Astrology: ఉద్యోగంలో మార్పులు, చేర్పులు ఉంటాయా? ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా.. !

| Edited By: Janardhan Veluru

Aug 24, 2023 | 6:54 PM

Zodiac Signs: తాజాగా గ్రహాల స్థితిగతులను బట్టి ఉద్యోగంలో మార్పులు ఏమైనా చోటు చేసుకుంటాయా? ఉద్యోగం ఉంటుందా, పోతుందా? ఉద్యోగం మారే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే, రాశి రీత్యా దశమ స్థానాధిపతి ఎక్కడ, ఎలా ఉన్నదీ పరిశీలించాలి. దశమ స్థానం ఎలా ఉన్నదీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది.

Job Astrology: ఉద్యోగంలో మార్పులు, చేర్పులు ఉంటాయా? ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా.. !
Job Astrology
Follow us on

Astrology in Telugu: తాజాగా గ్రహాల స్థితిగతులను బట్టి ఉద్యోగంలో మార్పులు ఏమైనా చోటు చేసుకుంటాయా? ఉద్యోగం ఉంటుందా, పోతుందా? ఉద్యోగం మారే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే, రాశి రీత్యా దశమ స్థానాధిపతి ఎక్కడ, ఎలా ఉన్నదీ పరిశీలించాలి. దశమ స్థానం ఎలా ఉన్నదీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఉద్యోగ స్థానాధిపతి, అంటే దశమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడా, శత్రు క్షేత్రంలో ఉన్నాడా అన్నది తెలుసుకోవాలి. వివిధ రాశులకు ప్రస్తుతం దశమాధిపతి ఎక్కడున్నదీ ఇక్కడ స్థూలంగా గమనిద్దాం.

  1. మేషం: ఈ రాశికి దశమాధిపతి అయిన శనీశ్వరుడు ప్రస్తుతం లాభస్థానంలో, పైగా వక్రగతిలో సంచ రించడం జరుగుతోంది. ఈ లాభ స్థానం కూడా శనికి స్వక్షేత్రమే అయినందువల్ల ఈ రాశివారికి ఉద్యోగ భంగమేమీ ఉండదు. ఉద్యోగం ఊడిపోయే అవకాశం లేదు. పైగా, తప్పకుండా పురోగతి ఉంటుంది. జీతభత్యాలు పెరగడం, ప్రమోషన్ రావడం వంటివి కూడా జరుగుతాయి. ఈ శనీ శ్వరుడు వక్రించడం వల్ల ఉద్యోగంలో యాక్టివిటీ పెరుగుతుంది. బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.
  2. వృషభం: ఈ రాశివారికి దశమాధిపతి అయిన శనీశ్వరుడు దశమంలోనే సంచరిస్తూ ఉండడం ఒక విశేషం. ఉద్యోగపరంగా తప్పకుండా అదృష్టయోగం పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవ కాశం ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. దీనివల్ల మేలే జరుగుతుంది. విదేశాల్లో ఉద్యో గం లభించే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో భద్రతకు, స్థిరత్వానికి ఇబ్బందేమీ ఉండదు. ఏ రంగం వారైనప్పటికీ ఉద్యోగంలో సానుకూలతలు ఎక్కువగా ఉండే సూచనలున్నాయి.
  3. మిథునం: ఈ రాశికి దశమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగానికేమీ ఇబ్బంది ఉండకపోగా, ఆశించిన దాని కంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ గురువుతో రాహువు కూడా కలిసి ఉన్నందువల్ల ఉద్యోగానికి సంబంధించి విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు, పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది.
  4. కర్కాటకం: ఈ రాశివారికి భాగ్యాధిపతి అయిన గురువు దశమ స్థానంలో రాహువుతో కలిసి ఉన్నందువల్ల విదేశాల్లో లేదా విదేశీ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారు బాగా రాణిస్తారు. ఉద్యోగ స్థానంలో గురువు ఉండడం వల్ల ఉద్యోగానికి భంగమేమీ ఉండదు. అయితే, అధికారులు పనిభారాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇక్కడ రాహువు కూడా ఉన్నందువల్ల సహోద్యోగుల నుంచి అప్పుడప్పుడు ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతుంటాయి. ఉద్యోగ విషయాల్లో బాగా కలిసి వస్తుంది.
  5. సింహం: ఈ రాశికి దశమాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో వక్రించి ఉన్నందువల్ల తప్పకుండా ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు సైతం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశిని భాగ్య స్థానం నుంచి గురువు వీక్షిస్తున్నందువల్ల ఉద్యోగానికి ముప్పు ఉండకపోవచ్చు. స్థాన చలనాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో తరచూ మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది.
  6. కన్య: ఈ రాశికి దశమాధిపతి అయిన బుధుడు వ్యయంలో వక్రించి ఉన్నందువల్ల ఉద్యోగపరంగా చిక్కులు, సమస్యలు తప్పకపోవచ్చు. ప్రభుత్వోద్యోగులు కూడా సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ఉద్యోగం మారడం, దూర ప్రాంతాలకు బదిలీ కావడం వంటివి జరగవచ్చు. అధికారుల ఆగ్ర హానికి గురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగం పోయే అవకాశం ఉండకపోవచ్చు. అంతే కాక, ఉద్యోగంలో సహోద్యోగులు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడే సూచనలున్నాయి.
  7. తుల: ఈ రాశికి దశమాధిపతి అయిన చంద్రుడు ఏ రాశిలోనూ స్థిరంగా ఉండే అవకాశం లేనందువల్ల, ఉద్యోగంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కనిపించినంత స్థిరత్వం ఉద్యో గాల్లో కనిపించే అవకాశం లేదు. జీవితంలో అనేక ఉద్యోగాలు మారడానికి అవకాశం ఉంది. సాధా రణంగా వీరికి ఉద్యోగ జీవితం కుదురుగా ఉండదు. జీతభత్యాలను బట్టి మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం దశమ స్థానంలో రాశినాథుడే సంచరిస్తున్నందువల్ల ఉద్యోగానికి ఇబ్బందేమీ ఉండక పోవచ్చు.
  8. వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి ప్రస్తుతం స్వస్థానంలో బుధుడితో కలిసి ఉన్నందువల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఈ రాశివారి సేవలను అనేక విధాలుగా ఉపయోగించు కోవడం కూడా జరుగుతుంది. ఉద్యోగంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. జీతభత్యాలు పెరగ డంతో పాటు, ప్రమోషన్ లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగం మారే అవకాశం లేదు.
  9. ధనుస్సు: ఈ రాశివారికి దశమాధిపతి అయిన బుధుడు భాగ్య స్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ సంబంధంగా ఈ రాశివారికి ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. సరికొత్త ఆలోచనలు, కార్యక్రమాలతో ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో కార్యకలాపాలు విస్తృతం అవుతాయి.
  10. మకరం: ఈ రాశివారికి దశమాధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నందువల్ల ఉద్యోగపరంగా మంచి యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ స్థానంలో ఉన్న కేతువు కూడా ఉద్యోగ పరంగా సహకరించే అవకాశం ఉంది. ఒకటి రెండు ఉద్యోగాలు చేయడానికి కూడా అవకాశం ఉంది.
  11. కుంభం: ఈ రాశివారికి దశమాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం కన్యారాశిలో సంచరించడం వల్ల ఈ రాశివారు వేరే ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. సాధారణంగా సొంత ఊర్లో వేరే ఉద్యోగం లోకి మారే సూచనలున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో పని భారం పెరగడం లేదా బరువు బాధ్యతలు పెరగడం జరుగుతుంది. అధికారుల వల్ల లేదా సహోద్యోగుల వల్ల కొద్దిగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. సాధారణంగా ఉద్యోగ రీత్యా ఆదాయానికి భంగమేమీ ఉండకపోవచ్చు.
  12. మీనం: ఉద్యోగ స్థానాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నందువల్ల, ఉద్యోగానికి ఏమీ భంగం ఉండకపోవచ్చు. ఎక్కడ పనిచేస్తున్నా జీత భత్యాలకు, సరైన గుర్తింపునకు లోటు ఉండదు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. అధికారుల నుంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అధికారులు కొద్దిగా అతిగా పనిచేయించుకోవడం జరుగుతుంది. విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.