
కేతువు కుటుంబ సమస్యలను ఇవ్వడంలో దిట్ట. ఈ వక్ర గ్రహం మిస్టరీ గ్రహం కూడా అయినందువల్ల ఏ సమస్య ఎటువైపు నుంచి వస్తుందో, ఎలా వస్తుందో చెప్పడం కష్టం. కేతువుకు శృంగారమంటే ఇష్టం ఉండదు. 2025 మార్చి ఆఖరు వరకు ఈ గ్రహం కన్యా రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ గ్రహం విషయంలో, అంటే కుటుంబ సమస్యల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తరచూ దుర్గాదేవిని స్తోత్రం చేయడం, లలితా సహస్ర నామం పారాయణం చేయడం వల్ల కేతువుకు సంబంధించిన దోషాలు చాలావరకు తగ్గిపోతాయి. ఈ గ్రహం వల్ల కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడే రాశులుః మిథునం, సింహం, కన్య, తుల, కుంభం, మీనం.
మిథునం: ఈ రాశివారికి చతుర్థ (సుఖ) స్థానంలో కేతు సంచారం వల్ల సుఖ సంతోషాలు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో అనుకోకుండా సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. బదిలీలు, స్థాన చలనాలు, ప్రయాణాలు, వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగి విశ్రాంతి లేకపోవడం వంటి కారణాల వల్ల దాంపత్య సుఖం తగ్గే అవకాశం ఉంటుంది. దంపతుల్లో ఎవరో ఒకరికి స్వల్ప అనారోగ్యాలకు కూడా అవకాశం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరగడం కూడా ఓ కారణం కావచ్చు.
సింహం: ఈ రాశికి ద్వితీయ (కుటుంబ) స్థానంలో కేతువు సంచారం వల్ల దాంపత్య సుఖం చాలా తక్కు వగా ఉండే అవకాశం ఉంది. దాంపత్య సంబంధమైన సమస్యలతో పాటు శృంగార సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడడం, ఒకరి కొకరు దూరంగా ఉండాల్సి రావడం, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు వగైరా కారణాల వల్ల దాంపత్య సుఖం తగ్గవచ్చు. వీలైనంతగా వాదోపవాదాలు, స్పర్థలు, అపార్థాలు తగ్గించుకోవడం మంచిది.
కన్య: ఈ రాశిలో కేతువు సంచారం వల్ల సాధారణంగా ప్రవర్తనలో మార్పు రావడం, శృంగార జీవితం పట్ల కొద్దిగా వైముఖ్యం ఏర్పడడం, ఆధ్యాత్మిక చింతన కారణంగా కూడా దాంపత్య జీవితానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి జరుగుతాయి. ఈ మిస్టరీ గ్రహం ప్రభావం వల్ల మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో ఒకరిలో ఈగో సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్లడం, దీక్షలు తీసుకోవడం కూడా కారణం కావచ్చు.
తుల: ఈ రాశివారికి 12వ (శయన) స్థానంలో కేతు సంచారం వల్ల ఏదో ఒక కారణం మీద దంపతుల మధ్య ఎడబాటు కలిగే అవకాశం ఉంటుంది. స్థాన చలనాలు, ప్రయాణాలు, పర్యటనలు, అనా రోగ్యాలు, మాట తప్పడం వంటివి ఇందుకు కారణం కావచ్చు. బంధువుల వల్ల ఇద్దరి మధ్యా స్పర్థలు లేదా అనుమానాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. ఇద్దరిలో ొ ఒకరు విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సుఖ లోపానికి ఎక్కువ అవకాశం ఉంది.
కుంభం: ఈ రాశికి అష్టమ (మాంగల్య) స్థానంలో కేతువు సంచారం భార్యాభర్తల సంబంధానికి పెద్ద అవరోధంగా మారే అవకాశం ఉంది. తరచూ వాదోపవాదాలు జరగడం, మనస్పర్థలు ఏర్పడడం, పుట్టిం టికి వెళ్లడం వంటివి జరగవచ్చు. సతీమణి అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. సతీమణితో వ్యవహరించడంలో ఈ రాశివారు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఏదో ఒక కారణంగా ఇద్దరి మధ్యా తరచూ ఎడబాటు ఏర్పడుతూ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
మీనం: ఈ రాశివారికి సప్తమంలో కేతు సంచారం వల్ల భర్త ఆధిపత్యం పెరగడమో, భార్య గయ్యాళిగా మారడమో జరుగుతుంది. మొత్తానికి ఆధిపత్య పోరు, అహంభావం, ఈగో సమస్యల కారణంగా ఇద్దరి మధ్యా శృంగార కార్యకలాపాలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరిలో ఒకరికి అనారోగ్యం సోకే సూచనలు కూడా ఉన్నాయి. ఇద్దరి మధ్యా ఏదో విధమైన ఎడబాటు తలెత్తడం జరుగుతుంది. సాధారణంగా సతీమణి ధోరణిలోనే ఎక్కువగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.