మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు..!

Gemini Horoscope 2026: మిథున రాశి వారికి నూతన సంవత్సర ద్వితీయార్థం, ముఖ్యంగా జూన్ తర్వాత అద్భుతంగా ఉంటుంది. గురువు అనుకూలతతో ఉద్యోగ, ఆర్థిక, ప్రేమ జీవితంలో గొప్ప పురోగతి సాధిస్తారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు, ఆదాయ వృద్ధి, కుటుంబ సుఖం ఉంటాయి. ప్రారంభంలో కొన్ని ఖర్చులున్నా, తరువాతి కాలంలో అన్ని కోరికలు నెరవేరి, జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది.

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు..!
Gemini Horoscope 2026

Edited By:

Updated on: Dec 27, 2025 | 6:16 PM

మిథున రాశికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగా ఉండే అవకాశం ఉంది. జూన్ నెలలో గురువు ధన స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల జీవితం అన్ని విధాలా మెరుగుపడుతుంది. జీవనశైలిలో మార్పు వస్తుంది. సాధారణంగా ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే, ప్రధమార్థంలో మాత్రం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని నిరాశలు, ఆశాభంగాలు తప్పకపోవచ్చు. గౌరవ మర్యాదలకు లోటుండదు కానీ, వృత్తి, ఉద్యోగాలు ఆశించినంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయంతో పాటు వృథా ఖర్చులు, శుభకార్యాల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారాలు

దశమంలో శని, భాగ్య స్థానంలో రాహువు ఉండడం వల్ల విదేశీ ఉద్యోగాలకు అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదే శాలకు సంబంధించిన సంస్థల్లోకి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేసుకుంటారు. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోగల స్థితిలో ఉంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో బాగా బిజీగా, లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగులు ద్వితీయార్థంలో ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది.

ప్రేమలు, పెళ్లిళ్లు, సంతానం

సహోద్యోగితో ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. రాశినాథుడైన బుధుడు చాలావరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందువల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సంవత్సరం ద్వితీయార్థంలో, అంటే జూన్ తర్వాత మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లిళ్లకు దారితీస్తాయి. సంతానం లేనివారు జూన్ తర్వాత శుభవార్త వినే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది.

అనుకూల పరిస్థితులు

వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. జీవితం ఊహించని విధంగా సానుకూల మలుపులు తిరుగుతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది.

అనుకూలమైన నెలలు

ఈ రాశివారికి కొత్త సంవత్సరం ప్రథమార్థంలో మే నెల బాగా అనుకూలంగా ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు. జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ద్వితీయార్థంలో జూలై, నవంబర్ నెలలు అన్ని విధాలా బాగా కలిసి వస్తాయి. ఈ నెలల్లో కొత్త ప్రయత్నాలను చేపట్టడం మంచిది. ఆదాయం బాగా పెరగడానికి, మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరడానికి అవకాశం ఉంది.