Zodiac Signs
Astro Tips in Telugu: గ్రహచారంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంలోని గ్రహాల స్థితిగతుల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి రాకపోవచ్చు. అటువంటివారు గ్రహచారంలో తమకు అనుకూలంగా ఉన్న గ్రహాలకు కొద్దిపాటి పరిహారం చేయిస్తే శుభ ఫలితాలు అనుభవానికి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వారు ఏ విధమైన పరిహా రాలు చేయించడం వల్ల కొన్ని సమస్యల నుంచి, చికాకుల నుంచి, అనారోగ్యాల నుంచి బయట పడేది ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది.
- మేష రాశి: ఈ రాశిలో ప్రస్తుతం గురు, రాహువుల సంచారం జరుగుతోంది. దీనివల్ల మేష రాశి వారికి ఆర్థిక సమస్యలు వృత్తి ఉద్యోగ సంబంధమైన సమ స్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ రహస్య శత్రువులు, ఆటంకాలు సృష్టించేవారు, అసూయపడేవారు చుట్టూ చేరే సూచనలు ఉన్నాయి. ఇటువంటి దోషాల నివారణకు ఈ రాశి వారు దుర్గాదేవిని స్తుతించడం లేదా సుబ్ర హ్మణ్యాష్టకం చదువుకోవడం చాలా మంచిది. తమ మనసులోని విషయాలను ఎక్కడా బయట పెట్టకపోవడం శ్రేయస్కరం.
- వృషభ రాశి: ఈ రాశిలో ప్రస్తుతం బుధ, రవుల సంచారం జరుగుతున్నందువల్ల ఆర్థిక కుటుంబ ఉద్యోగ సంబంధమైన సమస్యలు తొలగిపోయే అవకాశం ఉన్నప్పటికీ, ఇతరులతో అపార్ధాలు లేదా విభేదాలు చోటుచేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల అందువల్ల ఆదిత్య హృదయం చదువుకోవడం లేదా వినాయక పూజ చేయించడం వల్ల ఆ దోషాలు తప్పకుండా తొలగిపోవడం జరుగుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం, కోపతాపాలు తగ్గించుకోవడం చాలా మంచిది.
- మిథున రాశి: ఈ రాశి వారికి ద్వితీయ లాభ స్థానాలలో శుభగ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పురోగతి ఉద్యోగాలలో అభివృద్ధి శుభవార్త శ్రవణం వంటివి అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. అయితే, వ్యయ స్థానంలో రవి బుధ గ్రహాలు ఉన్నందువల్ల రహస్య శత్రువులు ఉండటం, తప్పుడు ప్రచారం జరగటం, అపనిందలు మీద పడటం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది. వీటి నివారణ కోసం ఆదిత్య హృదయం పఠనం, సుందరకాండ పారాయణం వంటివి చేయవలసి ఉంటుంది. తమ మనసులోని మాటను ఎవరికీ చెప్పకపోవడం మంచిది.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి లాభ స్థానంలో రవి బుధ గ్రహాల సంచారం వల్ల వ్యక్తిగత పురోగతికి, ఆదాయం పెరుగుదలకు, గౌరవ మర్యాదలకు లోటు లేనప్పటికీ, అష్టమ శని కారణంగా, ప్రతి పని ఆలస్యం కావడం, శ్రమ పెరగటం, విశ్రాంతి లేకపోవడం, మధ్య మధ్య అనారోగ్యాలు పీడించడం వంటివి చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలను నివారించడానికి తరచూ శివాలయానికి వెళ్ళటం, అర్చన చేయించడం, వీలైతే అభిషేకం చేయించడం, శని గ్రహానికి దీపం వెలిగించడం వంటివి చేయడం మంచిది. ఓర్పు సహనాలను అలవరచుకోవడం అవసరం.
- సింహ రాశి: సింహ రాశి వారికి భాగ్య స్థానంలో గురు రాహువుల సంచారం దశమ స్థానంలో రవి బుధుల సంచారం ఒక విధంగా అదృష్ట యోగమే అయినప్పటికీ, సప్తమ స్థానంలో శనిసంచారం అనేక ఆటంకాలకు కారణం అవుతుంటుంది. పని భారం పెరగటం ఇంటా బయటా విపరీతమైన ఒత్తిడి ఉండటం, వంటివి జరిగే అవకాశం ఉంది. అంతేకాక ఈ రాశి వారిని చూసి ఇతరులు అసూయ పడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఇబ్బందులు పరిష్కారం కావటానికి క్రమబద్ధంగా ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. శివార్చన చేయించడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.
- కన్యా రాశి: ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రవి బుధ గ్రహాలు సంచరించడం ఆరవ స్థానంలో శని ఉండటం ఉద్యోగ పరంగా ఆర్థికంగా కుటుంబ పరంగా శుభ ప్రదమే కానీ అష్టమ స్థానంలో గురు రాహువులు ఉండటం వల్ల అడుగడుగునా ఆటంకాలు, అవరోధాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు వెనక్కి పోతుంటాయి. ఇటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ రాశి వారు తప్పనిసరిగా లలితా సహస్రనామం చదువుకోవడం మంచిది. మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో తెలుసుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
- తులా రాశి: తులా రాశి వారికి పంచమ స్థానంలో శని, సప్తమంలో గురు రాహువులు, దశమ స్థానంలో కుజ శుక్రులు సంచరించడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, మనసు లోని కోరికలు నెరవేరటం, లక్ష్యాలను చేరుకో వడం వంటి శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ రాశిలో కేతువు సంచరించడం అష్టమ స్థానంలో రవి, బుధ గ్రహాలు సంచరించడం వల్ల డబ్బు నష్టం, నయవంచన, మోసం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ రాశి వారు సుందరకాండ పారాయణం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వంటివి చేయడం మంచిది.
- వృశ్చిక రాశి: ఈ రాశి వారికి భాగ్య స్థానంలో శుక్ర, కుజ గ్రహాల సంచారం, సప్తమ స్థానంలో రవి బుధుల వల్ల కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి, శుభవార్త శ్రవణం ఉన్నప్పటికీ, అర్ధాష్టమ శనివల్ల, ఆరవ స్థానంలో గురు రాహువుల సంచారం వల్ల శత్రు భయం, రుణ భయం, రోగ భయం వంటివి వెంటాడే అవకాశం ఉంది. వీటినుంచి బయట పడటానికి ఈ రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకం లేదా కాలభైరవాష్టకం వంటివి క్రమబద్ధంగా చదువు కోవడం చాలా మంచిది. తమ బలహీనతలను ఇతరులకు చెప్పకపోవడం శ్రేయస్కరం.
- ధనూ రాశి: ఈ రాశి వారికి శని, గురు, రాహు, రవి, బుధ, శుక్ర గ్రహాల సంచారం చాలావరకు అనుకూలంగా ఉండటం వల్ల ప్రయత్నాలలో విజయం, మనసులోని కోరికలు నెరవేరటం, అనారోగ్యాల నుంచి ఉపశమనం, ఆర్థిక సమస్యల పరిష్కారం, ఆదాయం పెరగటం వంటివి జరిగే అవకాశం ఉన్నప్పటికీ, నర ఘోష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విలువైన వస్తువులు పోవటం చిన్నచిన్న ప్రమాదాలు జరగటం మోసాలకు గురికావడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యల నివారణకు ఈ రాశి వారు ప్రతిరోజూ ఉదయం దత్తాత్రేయ స్వామిని లేదా నరసింహస్వామిని పూజించడం మంచిది.
- మకర రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ, ఆర్థిక కుటుంబ సంబంధమైన సమస్యలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, మోసాలకు గురికావడం, దొంగతనాలు జరగటం, అపనిందలు మీద పడటం, దుష్ప్రచారం జరగటం వంటి వాటికి అవకాశం ఉంది. అందువల్ల ఈ దోష నివారణకు పరిహారం చేయించుకోవడం మంచిది. తరచూ శివాలయానికి వెళ్ళటం, ఇంట్లో అభిషేకం చేయడం విఘ్నేశ్వర హోమం చేయించడం వంటివి ఈ రాశి వారికి తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాయి. ఆదాయం గురించి ఆదాయ ప్రయత్నాల గురించి ఇతరులకు చెప్పకపోవడం మంచిది.
- కుంభ రాశి: కుంభ రాశి వారికి చతుర్ధ స్థానంలో రవి, బుధ గ్రహాల సంచారం ఆరవ స్థానంలో కుజ, శుక్ర గ్రహాల కలయిక చాలావరకు అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందటానికి ఆదాయం పెరగటానికి అవకాశం ఉంది. అయితే ఏలినాటి శని కారణంగా ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉండటం, ఉద్యోగంలో పని భారం పెరగటం, అదనపు బాధ్యతలు మీద పడటం, అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కాకపోవటం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యల నివారణకు వీరు తప్పకుండా శివార్చన చేయించడం లేదా వినాయకుడిని పూజించడం చాలా మంచిది.
- మీన రాశి: ఈ రాశి వారికి గురు, రాహువులు, రవి, బుధులు, కుజ, శుక్రులు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా కూడా లబ్ధి పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఏలినాటి శని కారణంగా, అనవసర ఖర్చులు అనవసర పరిహారాలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖర్చుల భారం విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అసూయపరుల వల్ల ముప్పు పొంచి ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఈ రాశి వారు తప్పనిసరిగా సుందరకాండ లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయవలసి ఉంటుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..