ఆర్థిక సమస్యలను భరించడం చాలా కష్టం. ఈ సమస్యల నుంచి ఎప్పుడు, ఎలా బయటపడటం అనేది చాలామందికి ఒక పెద్ద సమస్య. ఈ ఏడాది వివిధ రాశుల వారు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారు లేదా ఎలా పరిష్కరించుకుంటారు అనేది ఇక్కడ పరిశీలిద్దాం. సాధారణంగా ఆరవ స్థానం అధిపతి ఆర్థిక సమస్యలకు కారణం కాగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించేది పదకొండవ స్థానాధిపతి. ఆర్థిక సమస్యలకు శనీశ్వరుడు కారణం కాగా గురువు ఈ సమస్యలకు పరిష్కారం చూపించే గ్రహం.
మేష రాశి: ఈ రాశిలో ప్రస్తుతం గురు బుధ గ్రహాలు సంచరిస్తూ ఉండటం, లాభ స్థానంలో శనీశ్వరుడు ఉండటం వంటి కారణాలవల్ల ఈ రాశి వారు రుణ లేదా ఆర్థిక సమస్యల్లో ఇరుక్కోవడానికి అవకాశం లేదు. ఆర్థిక సమస్యలు పెద్దగా చుట్టుముట్టే అవకాశం కూడా లేదు. గతంలో ఏవైనా రుణాలు చేసి ఉంటే అవి ఈ ఏడాది నవంబర్ లోపల తప్పకుండా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. లాభ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నంత కాలం ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. ఈ రాశి వారికి ధన కారకుడైన గురు గ్రహం కూడా బాగా అనుకూలంగా ఉండటం వల్ల అతి త్వరగా ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.
వృషభ రాశి: ఈ రాశి వారు సాధారణంగా ఆర్థిక సమస్యలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక లేదా రుణ సమస్యల్లో ఇరుక్కున్న పక్షంలో ఒక పట్టాన బయటకి రాలేకపోవటం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో ఈ రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సాధారణంగా ఈ రాశి వారు శుభకార్యాలు, విలాసాల కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ ఏడాది వీరికి ధన కారకుడైన గురుగ్రహం అనుకూలంగా లేనందువల్ల ఎవరికైనా వాగ్దానాలు చేయటం కానీ, హామీలు ఉండటం కానీ చేయకపోవడం మంచిది. ఆదాయం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు అంతకు మించిన స్థాయిలో ఉండటం జరుగుతుంది.
మిథున రాశి: సాధారణంగా ఈ రాశి వారికి ఈ ఏడాదంతా ఆర్థిక సమస్యలు తలెత్తకపోవచ్చు. ఇల్లు కొనడానికి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని ఆర్థిక సమస్యగా పరిగణించలేము. ఆరోగ్య అవసరాలకు, శుభకార్యాలకు, వివాదాల పరిష్కారానికి తీసుకున్న అప్పు గురించి మాత్రమే ఇక్కడ ఆలోచించవలసి ఉంది. ఈ రాశి వారికి ఈ ఏడాది ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదు. గతంలో చేసిన అప్పుల నుంచి ఈ ఏడాది విముక్తి పొందటానికి అవకాశం ఉంది. ఇతరుల రుణ సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి కూడా వీలుంది. అయితే, ఆర్థిక లావాదేవీలకు ఈ రాశి వారు దూరంగా ఉండటం మంచిది.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఏదో ఒక ప్లాన్ లేదా ముందు చూపు లేనిదే అప్పు చేసే అవకాశం ఉండదు. ఆర్థిక సమస్యలకు వీలైనంత దూరంగా ఉండటం ఈ రాశి వారి సహజ లక్షణం. ఈ ఏడాదంతా ఈ రాశి వారికి గురు బుధ శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీరి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కూడా వీరి రాబడి పెరుగుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను వీరు ఒక ప్రణాళిక ప్రకారం పరిష్కరించుకుంటారు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఈ రాశి వారిని ఆదుకునే వారు ఉంటారు. అందువల్ల వీరిని ఆర్థిక సమస్యలు ఎక్కువగా బాధించవు.
సింహ రాశి: ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీరిని రుణ యోగం బాధించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఈ రాశి వారు రుణగ్రస్తులు కాకపోవడం చాలా మంచిది. రుణం తీసుకునే పక్షంలో తీర్చడం చాలా కష్టం అవుతుంది. కొద్దికాలం పాటు ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు వీరికి నిద్ర పట్టకుండా చేసే అవకాశం ఉంది. వాస్తవానికి భాగ్యరాశిలో గురుగ్రహం సంచరిస్తూ ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు ఆర్థిక సమస్యల రూపంలో కొద్దిగా పీడించడానికి అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరుల కోసం అప్పు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
కన్యా రాశి: సాధారణంగా ఈ రాశి వారు ఆర్థిక సమస్యలలో చిక్కుకునే అవకాశం లేదు. ఒకవేళ ఎక్కడైనా రుణం తీసుకున్నప్పటికీ అవి తీర్చడానికి బాగా తాపత్రయపడటం జరుగుతుంది. వాస్తవానికి ఈ ఏడాది ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అయితే, రుణ సమస్యల్లో చిక్కుకోకుండా వీరు ముందుగానే జాగ్రత్తలు పడే అవకాశం ఉంది. ఈ రాశి వారిలో ఆర్థిక సంబంధ మైన ప్రణాళిక ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రుణ సమస్యలు అదుపులోనే ఉంటాయి. మితి మీరిన సమస్యలు ఉండకపోవచ్చు. చిన్నాచితకా ఆర్థిక సమస్యలు తలెత్తినప్పటికీ అవి అంతగా ఒత్తిడి తీసుకురాకపోవచ్చు.
తులా రాశి: ఈ రాశి వారు ఒక పట్టాన అప్పు చేయరు. వీరికి తనకు మాలిన ధర్మం అనేది ఉండదు. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇష్టపడరు. పొర పాటున ఎక్కడైనా అప్పు చేసినప్పటికీ వెంటనే తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. సంపాదన విషయంలోనే కాక ఖర్చు విషయంలో కూడా ఈ రాశి వారికి ఒక ప్లానింగ్ ఉంటుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది కానీ దీని కోసం అప్పు చేసే వ్యవహారం పెట్టుకోక పోవచ్చు. సాధారణంగా బ్యాంకు రుణాలను సైతం ఈ రాశి వారు త్వరగా తీర్చేయడం జరుగు తుంటుంది. అంతేకాక ఈ ఏడాది ఈ రాశి వారు ఆదాయపరంగా సురక్షితమైన స్థానంలో ఉండే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ ఏడాది ఆర్థిక సమస్యలను దగ్గరకు రానివ్వకపోవడం మంచిది. అప్పు చేసే పక్షంలో దానిని తీర్చడం చాలా కష్టం అవుతుంది. డబ్బు తీసుకోవడం లేదా ఇవ్వటం సమస్యలకు దారితీస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టమే తప్ప లాభం జరిగే సూచనలు లేవు. డబ్బు వ్యవహారాలలో ఎంత వీలైతే అంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. తప్పనిసరిగా పిసినారి అవతారం ఎత్తాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిం చాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా డబ్బు ఇచ్చినా అది త్వరగా తిరిగివచ్చే అవకాశం ఉండదు. ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కష్టార్జితం మిత్రుల వల్ల నష్టమయ్యే సూచనలు ఉన్నాయి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే అవకాశం లేదు. ఈ రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా విజయవంతం అయ్యే సూచనలు ఉన్నాయి కనుక ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుంది తప్ప రుణాలు చేసే అవకాశం లేదు. పైగా ఇతరులకు ఆర్థికంగా సహాయపడే అవకాశం కూడా ఉంది. గృహ రుణం తప్ప మిగిలిన ఆర్థిక సమస్యలన్నీ జూలై తరువాత పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మూడు శుభగ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మకర రాశి: ఈ రాశి వారు ఒక పట్టాన ఆర్థిక సమస్యల్లో ఇరుక్కోవడం జరగదు. సాధారణంగా వీరికి సహాయం చేసేవారు ఆదుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం అందుకు ఒక కారణం. ఈ రాశి వారు సంపాదన విషయంలోనే కాక ఖర్చు విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. గృహ సంబంధమైన రుణాలను కూడా త్వరగా తీర్చి వేయడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆర్థిక సమస్యల విషయంలో వీరి మీద ఒత్తిడి ఉండే అవకాశం లేదు. సాధారణంగా ఈ రాశి వారిలో ఇవ్వడమే తప్ప తీసుకునే లక్షణం ఉండదు. ఇతరులకు సహాయం చేయడం కోసం మాత్రమే రుణం చేస్తూ ఉంటారు. అయితే, ఈ రాశి వారు రుణగ్రస్తులు కావడం ఆర్థిక సమస్యల్లో ఇరుక్కోవడం వంటివి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి.
కుంభ రాశి: ఈ రాశి వారు పొరపాటున కూడా అప్పు చేయక పోవడం, ఆర్థిక సమస్యల్లో ఇరుక్కోకపోవడం చాలా మంచిది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు పాటించడం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. సాధారణంగా మితిమీరిన ఔదార్యం కారణంగా, డబ్బు విషయంలో ప్లానింగ్ లేని కారణంగా వీరు ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాలను తమ జీవిత భాగస్వామికో లేక కుటుంబ సభ్యు లకో అప్పగించడం మంచిది. వీరికి కొన్ని ఆర్థిక సమస్యలు రహస్యంగా కూడా కొనసాగుతూ ఉంటాయి. అంటే రహస్యంగా రుణాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
మీన రాశి: అట్టహాసంగా శుభకార్యాలు, ఆధ్యాత్మిక లేదా పుణ్యకార్యాలు నిర్వహించడం, వితరణలు చేయడం వంటి కారణాలవల్ల ఈ రాశి వారు తరచూ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. అయితే, ఆర్థిక సమస్యలతో ఎక్కువ కాలం గడపటం ఇష్టం లేక సాధ్యమైనంత త్వరగా వీటినుంచి బయటపడేందుకు విపరీతంగా కష్ట పడతారు. వీరు ఈ ఏడాది ఒకటి రెండు ముఖ్య మైన ఆర్థిక సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిలోగా ఈ సమస్యల నుంచి బయటపడ వచ్చు. ధన స్థానంలో గురుగ్రహం ఉన్నందువల్ల వీరికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అంతేకాక, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందే అవకాశం కూడా ఉంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..