మేష రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ తర్వాత వారి ఆర్థిక పరిస్థితిలో మార్పు..!

Aries 2026 Horoscope: మేష రాశివారికి కొత్త సంవత్సరమంతా ఏలిన్నాటి శని, కొత్త సంవత్సరంలో తొలి ఆరు నెలలు గురువు ప్రతికూలం. ఆర్థిక సమస్యలు, ఉద్యోగ, పెళ్లి ఆలస్యాలుంటాయి. జూన్ తర్వాత గురు బలం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థికాభివృద్ధి, పదోన్నతులు, శుభకార్యాలు, ఆరోగ్యం బాగుంటుంది. శని ప్రభావం తగ్గి, జీవితం సానుకూలంగా మారుతుంది.

మేష రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ తర్వాత వారి ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
Mesha Rashi 2026 Horoscope

Edited By:

Updated on: Dec 27, 2025 | 5:34 PM

Mesha Rashi 2026 Horoscope: మేషం రాశివారికి ఏలిన్నాటి శని ఈ ఏడాదంతా(2026) కొనసాగుతున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. ఆర్థిక పరిస్థితిలో ఆశించినంత మెరుగుదల ఉండే అవకాశం లేదు. మొదటి ఆరు నెలలు గురువు కూడా అనుకూలంగా లేనందు వల్ల ప్రయత్న లోపం ఎక్కువగా ఉంటుంది. ఆచితూచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. శత్రువులెవరో, మిత్రులెవరో తెలుసుకోవడం కష్టమవుతుంది. పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు మధ్య మధ్య ఒత్తిడికి గురి చేస్తుంటాయి. అయితే, మొదటి ఆరు నెలల కంటే, జూన్ తర్వాత నుంచి పరిస్థితిలో ఖాయంగా మార్పు వచ్చే అవకాశం ఉంది. చతుర్థస్థానంలో గురువు ఉచ్ఛపట్టి శనిని వీక్షిస్తున్నందువల్ల శని ప్రభావం తగ్గడంతో పాటు ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది.

వ్యక్తిగత జీవితంలో మార్పులు

ఈ రాశివారికి తృతీయ స్థానంలో గురువు సంచారం వల్ల ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా ఆశించిన స్థాయిలో కలిసి రాకపోవచ్చు. గృహ, వాహన ప్రయత్నాలకు ఆర్థిక సహాయం అంత తేలికగా లభించకపోవచ్చు. శ్రమ, తిప్పటతో పాటు వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో నిరుత్సాహ పరిస్థితులు, ఆశాభంగాలు ఎక్కువగా ఎదురవుతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు తరచూ ఇబ్బంది కలిగిస్తాయి. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.

అనవసర ఖర్చులు, కుటుంబ ఖర్చులు, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్నవారికి స్థానభ్రంశం కలుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే, జూన్ 3వ తేదీ నుంచి మాత్రం జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఈ రాశిలో గురువు ఉచ్ఛ పట్టడం వల్ల ఆర్థికాభివృద్ధి, పదోన్నతులు, విదేశాల్లో ఉద్యోగం, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం, సంతాన ప్రాప్తి వంటివి తప్పకుండా జరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వృత్తి, వ్యాపారాల పరంగా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు.

ప్రేమలు, పెళ్లిళ్లు

శుక్ర, బుధుల అనుకూలత కారణంగా ప్రేమలో పడడానికి అవకాశం ఉన్నప్పటికీ, మొదటి ఆరు నెలల్లో మాత్రం ప్రేమ జీవితం బలపడడం గానీ, పెళ్లికి దారితీయడం గానీ జరిగే అవకాశం లేదు. పెళ్లి ప్రయత్నాలు చివరి క్షణంలో వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. శని వ్యయ స్థానంలో ఉన్నందు వల్ల ప్రేమలు, పెళ్లిళ్లలో కాలయాపనలు, భారీ ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయడం, తొందరపడకపోవడం మంచిది.

ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారాలు

ఏలిన్నాటి శని దోషం వల్ల ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. అధికారులు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. మరో ఉద్యోగానికి మారడానికి అవకాశం ఉండకపోవచ్చు. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సివస్తుంది. విదేశీ ఉద్యోగాలు లభించడానికి అవకాశం ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉండకపోవచ్చు. ఏడాది ద్వితీయార్థంలో గురువు చతుర్థ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల పరిస్థితి మారవచ్చు. శని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విదేశీ ఆఫర్లు అందుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

ఆరోగ్యం, ఆర్థికావకాశాలు

ఈ రాశివారికి గురు బలం చాలినంత లేకపోవడం, శని బలం పెరగడం వల్ల ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం ఉత్తమం. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొత్త సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం ఆరోగ్యానికి, ఆదాయానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత లాభం ఉంటుంది. ఆస్తిపాస్తులు లభించే అవకాశం ఉంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి.

అనుకూలమైన నెలలు

ఈ రాశివారికి జూన్ తర్వాత నుంచి దాదాపు ప్రతి నెలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి నెలలోనూ ఉద్యోగపరంగా, ఆదాయపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. జూన్ లోపు మాత్రం ప్రధానగ్రహాలైన గురు, శనుల నుంచి ప్రతికూల ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. రాశ్యధిపతి కుజుడి అనుకూల సంచారం వల్ల మొదటి ఆరు నెలలు సాధారణంగా, యథాతథంగా గడిచిపోతాయి.

మొత్తం మీద ఈ రాశివారికి మొదటి ఆరునెలలు మిశ్రమంగానూ, ఆ తర్వాత ఆరు నెలలు ఉత్తమంగానూ గడిచిపోయే అవకాశం ఉంది. శనీశ్వరుడికి దీపం వెలిగించడం, ప్రదక్షిణలు చేయడం, శివార్చన చేయించడం వంటి చర్యల వల్ల శని ప్రభావం చాలావరకు తగ్గే అవకాశం ఉంది.