
Lucky Zodiac Signs
Growth Astrology: ఏ రాశికైనా తృతీయ స్థానంలో ఏదైనా గ్రహం ఉన్న పక్షంలో తప్పకుండా అభివృద్ధి ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ స్థానంలో పాప గ్రహమున్న పక్షంలో అది రెట్టింపు ఫలితాలనిస్తుంది. మూడవ స్థానాన్ని ఉపచయ స్థానమంటారు. ఉపచయ స్థానమంటే వృద్ది కేంద్రమని అర్థం. ఈ మూడవ స్థానంలో నవగ్రహాల్లో ఏ గ్రహమున్నా తప్పకుండా అభివృద్ది ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో అత్యధికంగా లాభాలనిచ్చే స్థానం ఇది. తృతీయంలో ఉన్న గ్రహాన్ని బట్టే జీవితానికి దిశా నిర్దేశనం లభిస్తుందని కూడా జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మేషం, కర్కాటకం, ధనుస్సు, మకరం, మీన రాశులకు ప్రస్తుతం తృతీయ స్థానంలో గ్రహ సంచారం జరుగుతోంది.
- మేషం: రాశ్యధిపతి కుజుడు మరో రెండు నెలలపాటు ఈ రాశికి మూడవ స్థానంలో ఉండబోతున్నందువల్ల ఇతరుల మీద ఆధారపడకుండా ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా అత్యధికంగా లాభం కలుగుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సంబంధమైన కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అరుదైన ఆఫర్లు అందుతాయి. ఏ విషయంలోనైనా దూసుకుపోతారు.
- కర్కాటకం: ఈ రాశికి తృతీయ స్థానంలో మే 18 వరకూ కేతువు సంచారం చేస్తున్నందువల్ల కొద్ది ప్రయ త్నంతో ఉద్యోగంలో ఒక మమెట్టు పైకి ఎదగడానికి అవకాశం ఉంది. కొంత ప్రయత్నపూర్వకం గానూ, కొంత అప్రయత్నంగానూ ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. జీవితంలో పైకి ఎదగడానికి సంబంధించి ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా తప్పకుండా పురోగతి ఉంటుంది.
- ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో శని, రవుల సంచారం అత్యధికంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. ప్రయత్న లోపం లేని పక్షంలో ఈ రాశివారు ఆర్థికంగానూ, ఉద్యోగపరంగానూ ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే సూచనలున్నాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో రాజీ మార్గం ద్వారా విముక్తి లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో రాహువు సంచారం విపరీత రాజయోగం కలిగిస్తుంది. మే 18న రాహువు రాశి మారే వరకూ వృత్తి, ఉద్యోగాల్లో వీరి వైభవానికి తిరుగుండదు. పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు, ఆదాయ వృద్ధికి ఎంతగా ప్రయత్నిస్తే అంత మంచిది. ఆదాయ మార్గాలు విస్తరించే సూచనలున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. మెరుగైన ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశికి మే 25 వరకూ తృతీయంలో రాశ్యధిపతి గురువు సంచారం కొనసాగుతున్నందువల్ల ప్రతి రంగంలోనూ ఊహించని పురోగతి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం ఉండదు. ఆదాయానికైనా, అధికారానికైనా ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. అనారోగ్యాలకు సరైన వైద్య చికిత్స లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.