Andhra Pradesh: సీఎస్, సీఎంఓకు ఫిర్యాదు చేసినా గైర్హాజరైన కలెక్టర్.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్.. అసలు కథ ఏంటంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి ఏలూరు జిల్లా కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొన్నాళ్ల క్రితం పేర్ని నానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు మధ్య తీవ్ర వివాదం జరిగింది. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తీరుపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి కూడా మాజీ మంత్రి ఫిర్యాదు చేశారు. ఒక ఐఏఎస్ అధికారిపై ఒక ఎమ్మెల్యే ఈ స్థాయిలో ఫిర్యాదు చేసారంటే బలమైన కారణమే ఉండాలి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి ఏలూరు జిల్లా కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొన్నాళ్ల క్రితం పేర్ని నానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు మధ్య తీవ్ర వివాదం జరిగింది. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తీరుపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి కూడా మాజీ మంత్రి ఫిర్యాదు చేశారు. ఒక ఐఏఎస్ అధికారిపై ఒక ఎమ్మెల్యే ఈ స్థాయిలో ఫిర్యాదు చేసారంటే బలమైన కారణమే ఉండాలి.. అందునా రెండేళ్ల క్రితం వరకూ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన పేర్ని నాని ఈ రకంగా ఫిర్యాదు చేయడం పెద్ద సంచలనమే అయింది.. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే పేర్ని నాని మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఉంది. అలాంటిది పక్కనున్న ఏలూరు జిల్లా కలెక్టర్ పై మాజీ మంత్రి ఇంతలా ఫైర్ కావడం ఏంటి..? పైగా ఈ మాజీ మంత్రి చేసిన ఫిర్యాదుతో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి మరీ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వచ్చి వివరణ ఇచ్చి వెళ్లారంటే ఇది రాజకీయ కోణమా లేక అడ్మినిస్ట్రేషన్ వ్యవహారమా అనే అనుమానాలు కూడా వస్తాయి. కానీ ఎమ్మెల్యే పేర్ని నానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కి మధ్య ఇంత పెద్ద వివాదానికి కారణం ఉమ్మడి కృష్ణా జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం.. ఇది నాలుగైదు నెలల కిందటి మాట.. తాజాగా మరోసారి ఈ ఇద్దరి మధ్య ఇదే పంచాయితీ వచ్చింది. దీనికి కారణం ఏంటో చూద్దాం..
అసలు కలెక్టర్‌కు పేర్ని నానికి గొడవ ఎందుకొచ్చిందో తెలుసా..?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో విభజనకు ముందు మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి.. జిల్లాల విభజన తర్వాత నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలోకి వెళ్లాయి.. అయితే, జిల్లా పరిషత్‌ల విభజన జరగలేదు.. గతంలో ఎన్నికైన విధంగానే ఉమ్మడి జిల్లాల వారీగా జెడ్పీ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి.. ఇదే కోవలో ఉమ్మడి కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశం మచిలీపట్నంలో జరిగింది.. సేమ్ టూ సేమ్.. గతంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగింది.. ఈ సమావేశానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఈ రెండు జిల్లాల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాత్రం హాజరుకాలేదు. అంతేకాదు కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల సమస్యలపై చర్చించేందుకు ఆ జిల్లా అధికారులు కూడా చాలామంది హాజరుకాలేదు.. అసలే ఒకప్పుడు కలెక్టర్ గైర్హాజరుపై నానా రభస చేసిన మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి కూడా అదే స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవస్థలంటే లెక్కలేని తనంతో ఏలూరు కలెక్టర్ వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇరిగేషన్ బోర్డు అడ్వైజరీ కమిటీ సమావేశం ఉందంటూ గైర్హాజరు కావటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. జెడ్పీ సమావేశం ఉందని తెలిసినా ఎందుకు రాలేదని పేర్ని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన జడ్పీ సమావేశానికి కలెక్టర్ రాకుండా, కింది స్థాయి అధికారులను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఇదే విషయంపై గతంలో సీఎస్‌కు, సీఎంఓకు ఫిర్యాదు చేసారు పేర్ని నాని.. అయినా మళ్లీ అదే రిపీట్ కావడంతో పేర్ని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనదైన స్టైల్ లో కలెక్టర్ తీరుపై మండిపడ్డారాయన. అయితే ఏలూరు జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల సమస్యలు ఎలా పరిష్కరించాలని అన్నారు.
సీఎస్‌కు, సీఎంఓకు ఫిర్యాదు చేసినా..
గతంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తీరుపై సీఎస్ కు ఫిర్యాదు చేసారు మాజీ మంత్రి పేర్ని నాని.. జెడ్పీ సమావేశానికి కలెక్టర్ రావాల్సిన అవసరం ఉందా లేదా క్లారిటీ ఇవ్వాలంటూ సీఎస్ ను కోరారు.. మరోవైపు సీఎం కార్యాలయానికి కూడా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వచ్చి వెళ్లారు.. అయినప్పటికీ.. మరోసారి ఇదే రిపీట్ కావడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చగా మారింది.. వాస్తవంగా ఒక జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక సమావేశంలో కలెక్టర్లు, అధికారులు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. మరి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాత్రం రెండోసారి కూడా జెడ్పీ సమావేశానికి గైర్హాజరు కావడం పట్ల పేర్ని నాని ఎలా ముందుకు వెళ్తారోననే చర్చ జరుగుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..