వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, ఘాటు వ్యాఖ్యలపై అంతే స్థాయిలో స్పందించారు వైసీపీ నేతలు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి నాయకులుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్క దారి పట్టిస్తూ ప్రతి పక్షాలు ఏవిధంగా రాద్దాంతం సృష్టిస్తున్నాయో చూస్తున్నామన్నారు. సినిమాలో డైలాగ్ లు చెప్పినట్లు రాజకీయాల్లో కుదరవని, ఇక్కడ మీకు టచప్ లు ఇచ్చేవారు ఎవరూ లేరన్నారు. ఇంతకాలం రహస్యంగా ప్రేమించుకున్న రహస్య ప్రేమికులు ముసుగు ఈరోజు బయట పడిందన్నారు. మీరు హీరోలు అనుకుంటున్నారు అని జనం దృష్టిలో మీరు జీరోలని అన్నారు. రాష్ట్రంలో నిజమైన హీరో జగన్ ఒక్కడేనని అన్నారు. నువ్వు హీరో అనుకుంటున్నావు కానీ చంద్రబాబుకు చెలికత్తె వేషం వేస్తున్నావంటూ కన్నబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేము బ్రహ్మనాయుడుని పాలో అవుతాము నువ్వు మాత్రం చంద్రబాబు నాయుడుని పాలో అవ్వని ఎద్దెవా చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కనీస పరిజ్ఞానం లేని వారు కూడా మాట్లాడని అంత నీచంగా ఉన్నాయన్నారు. వైసిపిలో ఉన్న కాపు ఎమ్మెల్యేలను మీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారని, రెండు లక్షల పుస్తకాలు చదివిన పరిజ్ఞానం ఇదేనా అని ప్రశ్నించారు. మీ భాష ఏంటి అసలు మీకు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు.
కాపులు గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. నీ పక్కన కూర్చునే అర్హత కాపులకు లేదా అని అడిగారు. వంగవీటి రంగా గురించి నువ్వు మాట్లాడతావు మరి మాజీ హోం మంత్రి హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ను సిఎం చేయడానికి రాజకీయాలు చేస్తున్నారు తప్ప మీరు సిఎం అవడానికి రాజకీయాలు చేయడం లేదన్న ప్రజలకు, తమకు వచ్చిందన్నారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సేవ చెయ్యడానికే జనసేన పార్టీ పెట్టాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన పథకాలు అపెందుకే బిజెపి వాళ్ళతో పవన్ కళ్యాణ్ కలిసి వున్నాడన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల ముసుగు తొలగిందని, వాళ్ళ మాట బాట ఒకటేనని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాటలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు కి మసాజ్,మాలిష్ చెయ్యడానికి రాజకీయాలలోకి వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..