ఎన్నికలు ముగిశాయి. కూటమికి అనూహ్య విజయం లభించింది. కనీవిని ఎరుగని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్ల పై దృష్టి సారించాయి. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు వైసిపి నాయకత్వంలోనే ఉన్నాయి. వాటిన్నంటిపై దృష్టిసారించింది కూటమి. ముందుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌పై కూటమి నేతలు దృష్టి సారించారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు గానూ విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి. టీడీపీ నగరంలో బాగా బలపడింది. అయినా రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జీవీఎంసీలో జెండా ఎగురవేయకపోతే బాగోదని అప్పటి వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ విజయసాయి రెడ్డి ఆ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత జీవీఎంసీకి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 98 డివిజన్లలో వైసీపీ 59 డివిజన్లు గెలుచుకోగా, టీడీపీ 30, జనసేన మూడు, సీపీఐ, సీపీఎం, బీజేపీ నుంచి ఒక్కొక్కరు, ఇండిపెండెంట్లు నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లుగా గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు జారిపోగా వైసీపీ బలం 56కు పడిపోయింది. అయినప్పటికీ గ్రేటర్‌పై పెత్తనం చేయడానికి ప్రతిపక్ష పార్టీకి ఈ మెజారిటీ చాలా తక్కువ. ఐతే, రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కొందరు గ్రేటర్ కార్పొరేటర్ల మనసు మారినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముఖ్య నాయకత్వానికి కొందరు టచ్‌లోకి వెళ్లినట్టు చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ మేయర్ పీఠం చుట్టూ సాధ్యాసాధ్యాలపై కూటమి పరిశీలన ప్రారంభించింది.
జీవీఎంఏంసీ కార్పొరేటర్లతో తాజాగా వైవీ సుబ్బారెడ్డి సమావేశం కావడం ఆసక్తిని కలిగిస్తోంది. మేయర్ పీఠంపై కూటమి కన్నేయడంతో అలెర్ట్ అయిన వైసీపీ.. తమ కార్పొరేటర్లు చేజారకుండా చర్యలు చేపట్టింది. కార్పొరేటర్లలో కొంత మంది టీడీపీ, జనసేనలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. స్పష్టమైన మెజారిటీ ఉన్నందున కార్పొరేటర్లందరూ కలసి ఉండాలని కోరారు వైవీ. పార్టీ ఫిరాయింపులకు, ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వవద్దని కార్పొరేటర్లుకు సూచించారు సుబ్బారెడ్డి.
కార్పొరేటర్లతో సమావేశం అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలలో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందనీ, అలాంటి ప్రలోభాలకు లొంగకుండా అందరం కలిసి సమిష్టిగా సమీక్షలు నిర్వహిస్తున్నాం అన్నారు. దాడులకు కూడా భయపడ వద్దని, పార్టీ ఆదుకుంటుందని శ్రేణులకు భరోసా ఇస్తున్నాం అన్నారు. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా పార్టీ అందుబాటులో ఉంటుందని, ఖచ్చితంగా ఆదుకుంటుందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..