ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. రహదారి నిర్మాణం కోసం కొండ మట్టిని తవ్వుతుండగా ఓ భారీ గుహ బయటపడింది. దీంతో స్థానిక ప్రజలు ఆ గుహను చూసేందుకు తరలివస్తున్నారు. గుహ లోపల లోతు ఎంత అంది.. అది ఏదైనా ప్రాంతానికి రహస్య మార్గమా..? గుహలో ఏదైనా చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయా అన్న అంశాలు తేలాల్సి ఉంది. అయితే ఏదైనా అరిష్టం జరుగుతుందేమో అన్న భయంతో.. స్థానికులు ఆ గుహలోకి వెళ్లేందుకు జంకుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం ముచ్చుమర్రి గ్రామ శివార్లో ఓ శివాలయం ఉంది. ఆలయానికి సమీపంలోని కొండలో గుహ బయటపడింది. రోడ్డు కోసం పొక్లెయిన్లతో మట్టి తవ్వకాలు జరుపుతుండగా ఈ గుహ బయటపడిందని అక్కడి గ్రామస్థులు వివరించారు. ఈ గుహ…చాలా పొడవుగా, పెద్దగా ఉండటంతో.. అందరూ ఆకర్షితులవుతున్నారు. గుహ బయల్పడిన ప్రాంతాన్ని క్లీన్ చేశారు. గుహలోకి రాయి విసిరితే చాలా దూరం వెళ్తుంది అంటున్నారు. గుహ ఎంతలోతు ఉంటుందో తెలుసుకోడానికి అందరూ ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.
కొందరు లోపలికి వెళ్తే.. ఏదైనా కీడు జరుగుతుందేమో అని జంకుతుంటే.. మరికొందరు.. మట్టి పెళ్లలు పడతాయన్న భయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ గుహను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది ప్రజలు తరలివస్తున్నారు. ప్రస్తుతం బయటపడిన గుహ శివాలయానికి సమీపంలో ఉండటంతో ఈ గుహలో ఈశ్వరుడిని ప్రతిష్ఠించనున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.