రైలుకు, ఫ్లాట్‌ఫాంకు మధ్య చిక్కుకున్న ఎంసీఏ విద్యార్ధిణి శశికళ ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో అత్యవసర చికిత్స అందించారు వైద్యులు. ఆమెను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించలేదు.
విజ్ఞాన్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్న యువతి గుంటూరు నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో అన్నవరం వద్ద ఎక్కింది. దువ్వాడ స్టేషన్‌లో రైలు ఆగడంతో దిగేందుకు ప్రయత్నించిన ఆమె హడావుడిలో జారిపడి రైలుకు, ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. ఆ యువతి భయంతో కేకలు వేయడంతో అందరూ షాక్ తిన్నారు. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి యువతిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వెంటనే ట్రైన్‌ను ఆపేశారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి యువతిని బయటకు తీసుకురాగలిగారు. గంటన్నరపాటు శ్రమించి.. ఫ్లాట్ ఫాంను కొంత తొలగించి ఆమెను బయటకు తీశారు. శశికళ నడుముకి గాయాలు కావడంతో.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారామె.
అవును ట్రైన్ కొన్ని స్టేషన్లలో చాలా తక్కువ సమయమే ఆగుతుంది. దిగేవాళ్లు దిగుతూనే ఉంటారు. ఎక్కేవాళ్లు ఎక్కుతూనే ఉంటారు. ముందు లోపల ఉన్న వాళ్లని దిగనిస్తే.. ఆ తర్వాత త్వరగా ఎక్కేయవచ్చు. పిల్లలు, వృద్ధులు ఉంటే.. ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. కానీ ట్రైన్ కదులుతుందేమో అన్న భయంతో చాలామంది ఫాస్ట్‌గా ట్రైన్ ఎక్కేందుకు ఆరాటపడతారు. దిగేటప్పుడు కూడా తొందరపడతారు. ఈ కన్‌ఫ్యూజన్‌లో, తొందర్లో మెట్లను చూడకుండా దిగేస్తారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు జరుగుతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. చిన్న.. చిన్న పొరపాట్లకే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అందుకు శశికళ ఘటనే ఉదాహారణ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..