యధేచ్చగా సాగుతున్న బెట్టింగ్స్ బారినపడి మరో యువకుడు బలయ్యాడు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద మేడపల్లికి చెందిన కిల్లాడ ఈశ్వరరావు అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాత్రి ఇంట్లో పడుకున్న ఈశ్వరరావును కుటుంబసభ్యులు తెల్లవారుజామున లేచి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. కుటుంబసభ్యులు సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి..
కిల్లాడ ఈశ్వరరావు బ్యాంకు నుండి నగదు తీసుకువచ్చి కార్డుల ద్వారా గ్రామస్తులకు అందించే ఎమ్ ఎస్ పి గా పనిచేస్తున్నాడు. అయితే ఎమ్ ఎస్ పి గా పనిచేస్తే వచ్చే చాలీచాలని జీతంతో ఈశ్వరరావుకు బ్రతకడం కష్టంగా మారింది. దీంతో మరో సంపాదన ఉంటే బాగుంటుందని ఆలోచించాడు. అందుకు ఈజీగా డబ్బు సంపాదించే బెటింగ్స్ మంచి మార్గం అని ఆలోచనకు వచ్చాడు. దీంతో బెట్టింగ్స్ వైపు దృష్టి సారించాడు. మొదట్లో బెట్టింగ్స్ లో కొద్దిపాటి డబ్బులు రావడంతో మరింతగా సంపాదించాలనే ఆశపుట్టింది. దీంతో అప్పులు చేసి ఎక్కువ మొత్తంలో బెట్టింగ్స్ వేయటం ప్రారంభించాడు.
బెట్టింగ్ తోపాటు మందు, ఇతర చెడు వ్యసనాలకు కూడా బానిస అయ్యాడు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. ఆ క్రమంలోనే బెట్టింగ్స్ లో తీవ్రంగా డబ్బులు పోయాయి. అలా ఓ వైపు బెట్టింగ్ లో పోయిన డబ్బులు మరో వైపు చెడు వ్యసనాల కారణంగా పెరిగిన ఖర్చుతో తీవ్రంగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దీంతో ఎలాగైనా సరే అప్పులు తీర్చాలని మరికొన్ని కొత్త అప్పులు చేసి మళ్లీ మళ్లీ బెట్టింగ్స్ వేయటం ప్రారంభించాడు. చివరకు తీవ్ర నష్టాలపాలై అప్పులు తీర్చలేక అవస్థలు పడ్డాడు.
అలా అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో చేసేది లేక ఇంట్లోనే పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు ఈశ్వరరావు. ఈశ్వరరావు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే జిల్లాలో తరచూ బెట్టింగ్స్ బారినబడి ఈశ్వరరావు వంటి యువకులు అనేక మంది మృత్యువాత పడుతున్నప్పటికీ పోలీస్ యంత్రాంగం మాత్రం బెట్టింగ్స్ ను అరికట్టడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి బెట్టింగ్ మాఫియా ఆట కట్టించి అమాయకుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు జిల్లావాసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…