AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. చింతచిగురు సాగుతో ఆశ్చర్యపరుస్తున్న రైతు.. ఏడాది అంతా ఆదాయం..

సాధారణంగా ఎండాకాలంలోనే ఎక్కువగా దొరికే చింతచిగురును ఏడాది పొడవునా పండిస్తూ, కిలోకు రూ.1,000 వరకు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు కృష్ణా జిల్లా రైతు పర్వతనేని శ్రీనివాసరావు. ప్రత్యేక సాగు పద్ధతులతో నాలుగు ఎకరాల్లో చింతతోటను అభివృద్ధి చేసి, చింతచిగురుతో పాటు చింతపండు, గింజలు, అంతర పంటల ద్వారా బహుళ ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వారెవ్వా.. చింతచిగురు సాగుతో ఆశ్చర్యపరుస్తున్న రైతు.. ఏడాది అంతా ఆదాయం..
Tamarind Leaves Farming
Sridhar Rao
| Edited By: |

Updated on: Aug 06, 2026 | 11:46 AM

Share

సాధారణంగా ఎండాకాలంలోనే ఎక్కువగా దొరికే చింతచిగురును ఏడాది పొడవునా పండిస్తూ, కిలోకు రూ.1,000 వరకు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్న రైతు గురించి ఎప్పుడైనా విన్నారా? సంప్రదాయ పంటలకు భిన్నంగా ఆలోచించి, మార్కెట్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి వ్యవసాయాన్ని బంగారు బాటగా మార్చుకున్నాడు కృష్ణా జిల్లా రైతు పర్వతనేని శ్రీనివాసరావు.

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, అందరిలా సంప్రదాయ పంటలపై ఆధారపడకుండా మార్కెట్‌లో ఉన్న అవకాశాలను గుర్తించారు. అనంతపురం పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన ‘అనంత రుద్ర’, ‘తెట్టుమాలిగ’ హైబ్రిడ్ రకాలతో నాలుగు ఎకరాల్లో ప్రత్యేక చింత తోటను ఏర్పాటు చేశారు.

ఈ తోట ప్రత్యేకత ఏమిటంటే.. చెట్లను కేవలం 4 నుంచి 5 అడుగుల ఎత్తులోనే ఉంచుతూ నిరంతరం కత్తిరింపులు చేస్తారు. పాత ఆకులను తొలగించడం వల్ల కొత్త చిగురు నిరంతరం వస్తూ ఉండటంతో ఏడాది పొడవునా తాజా చింతచిగురు లభిస్తోంది. మొదటి ఐదేళ్లు ఆదాయం లేకపోయినా ఓర్పుతో సాగు కొనసాగించిన శ్రీనివాసరావు, ఇప్పుడు దాదాపు ప్రతిరోజూ ఆదాయం ఆర్జిస్తున్నారు.

ఈ తోటలో గత 20 ఏళ్లుగా విజయనగరం జిల్లాకు చెందిన 5 నుంచి 6 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కో కూలీ రోజుకు సుమారు ఒకటి నుంచి ఒకటిన్నర కిలోల చింతచిగురు మాత్రమే కోయగలరు. తోటతో పాటు కూలీల సంక్షేమాన్ని కూడా సమానంగా చూసుకోవడం వల్లే ఈ విజయం సాధ్యమైందని రైతు చెబుతున్నారు.

Tamarind Leaves

ప్రస్తుతం మార్కెట్‌లో చింతచిగురు కిలో ధర రూ.1,000 వరకు పలుకుతోంది. అయితే కూలీల వేతనాలు, రవాణా, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి కిలో ఉత్పత్తికి రూ.500 నుంచి రూ.700 వరకు వ్యయమవుతుందని రైతు తెలిపారు. అయినప్పటికీ ఏడాది పొడవునా ఉండే డిమాండ్ కారణంగా ఈ సాగు ఎంతో లాభసాటిగా మారిందని చెప్పారు. చింతతోటతో పాటు మల్బరీ, వాటర్ ఆపిల్, కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తూ అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో 100 గ్రాముల చింతచిగురు రూ.100 వరకు విక్రయమవుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో చింతచిగురుతో చేసే ప్రత్యేక వంటకాలకు డిమాండ్ పెరగడంతో ఖర్చుకు వెనకాడకుండా కొనుగోలు చేస్తున్నారని రైతు తెలిపారు. ఒక పెళ్లిలో చింతచిగురుతో కూర చేయాలంటే వేల రూపాయలు ఖర్చవుతుందని, అందుకే దీనిని సరదాగా ‘రిచ్ కర్రీ’ అని కూడా పిలుస్తున్నారని చెప్పారు.

మార్కెట్‌ను ముందే అంచనా వేసి సాగు చేస్తే వ్యవసాయం ఎప్పటికీ నష్టపోదని శ్రీనివాసరావు చెబుతున్నారు. చింతచిగురు తర్వాత చింతపండు, గింజల రూపంలోనూ అదనపు ఆదాయం వస్తుందని, అందుకే దీనిని ‘రిచ్ క్రాప్’గా అభివర్ణిస్తున్నారు. ఓర్పు, సరైన ప్రణాళిక, మార్కెట్‌పై అవగాహన ఉంటే చిన్న విస్తీర్ణంలోనూ పెద్ద విజయాలు సాధించవచ్చని కృష్ణా జిల్లా రైతు పర్వతనేని శ్రీనివాసరావు తన విజయగాథతో నిరూపించారు.

Tamarind Leaf Cultivation

Follow Us